ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా రెడ్ బుక్ రాసుకోవాలంట!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు ఎదురవుతున్నాయని.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.

Update: 2025-01-06 10:29 GMT

ఏపీ రాజకీయాల్లో ‘రెడ్ బుక్’ అనేది ఎంతటి హాట్ టాపిక్కో తెలిసిన సంగతే. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ తెరపైకి తెచ్చిన ఈ ఎర్ర బుక్ వ్యవహారం.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో... ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ తరహాలో తమను ఇబ్బందులు పెట్టినవారి పేర్లు రాసి పెట్టుకోవాలనే సూచనలు తెరపైకి వచ్చాయి!

అవును... ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు ఎదురవుతున్నాయని.. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ప్రధానంగా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేసే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలో జరిగిన ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఉద్యోగులను ఎవరైనా ఇబ్బంది పెడితే, వారి పేర్లు రాసి పెట్టుకోవాలని వెంకట్రామిరెడ్డి సూచించారు. ఉద్యోగులను మంత్రులు హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టేవారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. దీంతో... ఇది కూడా రెడ్ బుక్ మార్క్ హెచ్చరికలు లాగానే ఉన్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇదే సమయంలో.. కూటమి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులను టార్గెట్ చేసి వేధిస్తోందని.. కూటమి అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామన్నారని.. అదే విధంగా వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామన్నారని.. కానీ వాటిని విస్మరించారని అన్నారు. అదే విధంగా... ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పి ఇప్పటివరకూ ఇవ్వలేదని.. ఉద్యోగులను ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంకట్రామిరెడ్డి విమర్శించారు.

కూటమి ప్రభుత్వం వేధింపులు తాళలేక ఇప్పటివరకూ ఐదు మంది ఎంప్లాయిస్ ఆత్మహత్య చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకట్రామిరెడ్డి.. గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని, ఇందులో భాగంగా వందలాది మంది సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని.. సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.

Tags:    

Similar News