కాకినాడ పోర్టులో వాటాలు తిరిగిచ్చేసిన అరబిందో? చక్రం తిప్పిన కేవీ రావు
కాకినాడ పోర్టులో కేవీ రావుకు చెందిన వాటాలను తిరిగి ఆయనకే అప్పగిస్తూ అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కీలక మలుపు తిరిగింది. తనను బెదిరించి పోర్టులో వాటాలు తీసుకున్నారని వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ విక్రాంత్ రెడ్డి, అరబిందో శరత్ చంద్రారెడ్డిలపై ఫిర్యాదు చేసిన పోర్టు యజమాని కేవీ రావు చాకచక్యంగా వ్యవహరించి తన వాటాలను తిరిగి దక్కించుకున్నారు. ఈ వ్యవహారంపై సీఐడీ కేసు నమోదు చేయడం, ఈడీ రంగంలోకి దిగడంతో పోర్టులో వాటాలు దక్కించుకున్న అరబిందో కూడా వెనక్కి తగ్గి కేవీ రావుకు చెందిన వాటాలను తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కాకినాడ సెజ్ వాటాలను మాత్రం అరబిందో అట్టే పెట్టుకున్నట్లు చెబుతున్నారు.
కాకినాడ పోర్టులో కేవీ రావుకు చెందిన వాటాలను తిరిగి ఆయనకే అప్పగిస్తూ అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రముఖుడి మధ్యవర్తిత్వంతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరినట్లు చెబుతున్నారు. దీంతో మూడు రోజుల క్రితం గుట్టుచప్పుడు కాకుండా వాటాల బదిలీ పూర్తయినట్లు సమాచారం. వాటాల బదిలీపై సీఐడీ, ఈడీ దర్యాప్తు జరుపుతున్న వేళ.. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ జరిపితే ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో వాటాలను వదులుకోడానికి అరబిందో సిద్ధపడిందని అంటున్నారు.
ప్రతిష్ఠాత్మక సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న అరబిందో యాజమాన్యం ఈడీ విచారణపై అప్రమత్తంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ అభియోగాలు నమోదు చేస్తే సంస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుందని అరబిందో యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసిందని అంటున్నారు. దీంతో ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునేలా కేవీ రావు పావులు కదిపారని సమాచారం. దీంతో కొందరు ఉన్నతస్థాయి వ్యక్తులు ఇరువర్గాల మధ్య రాజీప్రయత్నాలు మొదలుపెట్టి విజయవంతం చేశారని అంటున్నారు.
అప్పట్లో రూ.2,500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను రూ.494 కోట్లకు తీసుకున్నారని సీపోర్టు యజమాని కేవీ రావు ఆరోపించారు. అదేవిధంగా 8 వేల ఎకరాల కాకినాడ సెజ్ భూములు అరబిందో సొంతం చేసుకుందని ఫిర్యాదు చేశారు. అయితే రాజీలో భాగంగా అరబిందో పేరున ఉన్న 2.15 కోట్ల బదిలీ తిరిగి కేవీ రావుకు బదిలీ చేశారు. ఇందుకు ప్రతిగా కాకినాడ సెజ్ భూములను అరబిందోకు వదిలేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే సెజ్ భూములు మాత్రం వదులుకునేది లేదని కేవీ రావు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అరబిందో తనకు ఇచ్చిన రూ.494 కోట్ల రూపాయలను కేవీ రావు తిరిగి ఇచ్చేశారని చెబుతున్నారు. ఇక రూ.1104 కోట్ల విలువైన కాకినాడ సెజ్ భూములు రూ.12 కోట్లకు తీసుకున్నారనే వివాదం ఇంకా పెండింగులో ఉన్నట్లు చెబుతున్నారు. సీపోర్టుకు స్టాక్ ఎక్స్ఛేంజీతో సంబంధం లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం సాగిపోయింది. అయితే ఈ డీల్ పై సీఐడీ, ఈడీ ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి.