కాళేశ్వరం అవినీతి అంటూ ఏసీబీకి ఫిర్యాదు... మొదలైపోయిందా
ఇక టీపీసీసీ చీఫ్ హోదాలో కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు! ఈ సమయంలో తాజాగా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు అందింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆ పార్టీ నేతలు ఇప్పటివరకూ చేసిన విమర్శలు, సవాళ్లు హాట్ టాపిక్ గా మారతాయని తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరిగింది. ఇక టీపీసీసీ చీఫ్ హోదాలో కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు! ఈ సమయంలో తాజాగా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఏసీబీకి ఫిర్యాదు అందింది.
అవును... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన, రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణలో కీలక ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఫిర్యాదులు మొదలయ్యాయి. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలో తాజాగా ప్రముఖ న్యాయవాది రాపోలు భాస్కర్... కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రధానంగా నకిలీ ఎస్టిమేషన్లు ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆయన పేర్కొన్నారు! ఈ సందర్భంగా... మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ ప్రాజెక్టులో ప్రధానంగా ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్లు దోపీడీ జరిగిందని రాపోలు భాస్కర్ చెబుతున్నారు! తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట భారీగా ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని ఆయన తెలిపారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఈ సందర్భంగా ఫిర్యాదులో కోరారు. మరి ఈ ఫిర్యాదుపై ఏసీబీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది వేచి చూడాలి!
ఈ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏసీబీకి ఫిర్యాదు అందడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాత్ర ఉందా.. లేక, రాపోలు భాస్కర్ వ్యక్తిగతంగానే ఫిర్యాదు చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కాగా... అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి భారీ ఎత్తున జరిగిందంటూ రేవంత్ తో పాటు కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అధికారంలోకి రాగానే ఆ ప్రాజెక్ట్ పై విచారణ జరిపిస్తామని, అవినీతి డబ్బులను తిరిగి ప్రజలకు చేరేలా చూస్తామని పలుమార్లు వ్యాఖ్యానించారు.