తెలంగాణ తల్లికాదు.. కాంగ్రెస్ తల్లి.. : కవిత తీర్మానం
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సంప్రదాయాలు ఒంట బట్టాయని ఎద్దేవా చేశారు.
'తెలంగాణ తల్లి' విగ్రహం చుట్టూ ముసురుకున్న ఆ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తింపు లేదని, తెలంగాణ సమాజం ఆ విగ్రహాన్ని గుర్తించడం లేదని బీఆర్ ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో శనివారం తెలంగాణ జాగృతి నేతృత్వంలో 2014లో కేసీఆర్ తీసుకువచ్చిన తెలంగాణ తల్లి విగ్రహమే అసలు సిసలు తెలంగాణ తల్లి అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం .. కేవలం 'కాంగ్రెస్ తల్లి' విగ్రహమేనని తేల్చి చెప్పారు.
ఈ మేరకు తెలంగాణ జాగృతి పక్షాన కవిత తీర్మానం చేశారు. దీనిని ఆ పార్టీ నాయకులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, కార్యకర్తలతో పాటు ఉద్యమ మేధావులు, కవులు , రచయితలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల కంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సంప్రదాయాలు ఒంట బట్టాయని ఎద్దేవా చేశారు. ఆయనకు తెలంగాణ తల్లి పట్ల ఎలాంటి అభిమానం కానీ, ప్రేమ కానీ లేవన్నారు. అందుకే రాత్రికి రాత్రి విగ్రహాన్ని మార్చేశారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి, స్నేహ శీలతకు ప్రతీక అయిన బతుకమ్మ గురించి సీఎం పట్టించుకోలేదన్నారు.
అందుకే కొత్తగా తీసుకువచ్చిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తీసేశారని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి వైభవాన్ని చాటేలా కొత్త ఉద్యమానికి ఊపిరి పోస్తున్నట్టు కవిత చెప్పారు. త్వరలోనే రాష్ట్ర మంతా పర్యటించి.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహమే అసలు సిసలు.. విగ్రహమని ప్రజలకు చాటి చెప్పే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు కవిత తెలిపారు. జొన్న కంకి, బతుకమ్మ లేని తెలంగాణ విగ్రహం.. దేనికీ పనికిరాదన్నారు. బతుకమ్మ అగ్రవర్ణాల పండుగ కాదని.. తెలంగాణలోని ప్రతి గడప పండగని తెలిపారు. ఈ విషయం కూడా తెలియని వారు.. రాష్ట్రంలో విగ్రహాల రాజకీయం చే్స్తున్నారని మండిపడ్డారు. కాగా, కవిత ప్రతిపాదనకుకవులు, రచయితలు, తెలంగాణ ఉద్యమ నాయకులు మద్దతు తెలిపారు.