కవితకు దక్కని ఊరట.. కోర్టు సంచలన తీర్పు!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు

Update: 2024-07-05 10:09 GMT

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. మార్చి 15న ఆమెను ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని తీహార్‌ జైలులోనే ఉన్నారు. పలుమార్లు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసినా కోర్టు నిర్ద్వందంగా తిరస్కరించింది.

ఇంతకుముందు కవితకు పలుమార్లు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ గడువు పూర్తి కావడంతో జైలు అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపర్చారు. దీంతో కోర్టు మళ్లీ జూలై 18 వరకు ఆమె రిమాండ్‌ ను కోర్టు పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూలై 18 వరకు కవిత జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

కవితను కోర్టు ముందు హాజరుపరిచిన సందర్భంగా కోర్టులో వాదనలు జరిగాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశామని సీబీఐ తరఫున న్యాయవాది న్యాయమూర్తికి నివేదించారు.

మరోవైపు కవిత తరఫు న్యాయవాది ఆమెను విడుదల చేయాలని వాదించారు. ఈడీ ఇప్పటికే చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ, కవిత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు కవిత రిమాండ్‌ ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఈడీ ఏడు చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కవిత బెయిల్‌ పిటిషన్‌ ను కొద్ది రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

ఢిల్లీ మద్యం కేసులో తనపై నమోదైన మనీలాండరింగ్‌ కేసును సవాల్‌ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మార్చి 15న ఆమె అరెస్టు కాగా మార్చి 26 నుంచి ఢిల్లీలోని తీహార్‌ జైలులోనే ఉన్నారు.

కవితపై ఈడీ కేసులతో పాటు సీబీఐ కూడా అవినీతి ఆరోపణలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కవిత ఈడీ కేసు, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. బెయిల్‌ కోసం కోర్టు దరఖాస్తు చేసుకున్న ప్రతిసారీ ఈడీ, సీబీఐలు గట్టి వాదనలు వినిపించి కవితకు బెయిల్‌ రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నిరాశ తప్పలేదు.

కాగా ఢిల్లీ మద్యం కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు మాగుంట రాఘవ, మరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్‌ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News