ఓటేయలేకపోయిన ఆ మహిళా ఎమ్మెల్సీ..? బహుశా తొలిసారేమో..

ఆమె సొంతంగా పోటీకి దూరమయ్యారు. తన తండ్రి స్థాపించిన పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల ప్రచారమూ చేయలేకపోయారు

Update: 2024-05-13 08:54 GMT

ఆమె సొంతంగా పోటీకి దూరమయ్యారు. తన తండ్రి స్థాపించిన పార్టీ తరఫున తొలిసారి ఎన్నికల ప్రచారమూ చేయలేకపోయారు. ఇప్పుడు ఓటు హక్కును కూడా వినియోగించుకోలేపోయారు. బహుశా ఇలా జరగడం ఆమెకు తొలిసారేమో? తండ్రి ఎమ్మెల్యేగా, ఎంపీగా, సీఎంగా, తాను స్వయంగా ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్న ఏ సమయంలోనూ ఇలాంటి అనుభవం ఎదురై ఉండకపోవచ్చు.

రేపటి వరకు జ్యుడీషియల్ కస్టడీలోనే..

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మార్చి 15న అరెస్టు చేసింది. ఈ కేసులో తీహార్ జైలులో ఉన్నారు ఆమె. గత మంగళవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. అయితే, ఈ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం ఈ నెల 14 వరకు పొడిగించింది. అంటే.. మంగళవారం వరకు అన్నమాట. గత మంగళవారం కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మళ్లీ మే 14న కవితను కోర్టులో హాజరు పర్చాలని ఆదేశించారు.

ప్రచారానికే కాదు.. ఓటుకూ దూరం

బయట ఉండి ఉంటే గనుక కవిత ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేసేవారేమో..? అది వీలుకాకున్నా, బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసేవారని చెప్పవచ్చు. ఆమె ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కూడా. దే విషయం గతంలో కోర్టుకూ చెప్పారు కవిత. అనారోగ్య కారణాలతోనూ బెయిల్ అడిగారు. కానీ, న్యాయ స్థానం ఇవేవీ పరిగణనలోకి తీసుకోలేదు. చివరకు ప్రచారానికే కాదు.. కనీసం ఓటు హక్కు వినియోగానికీ ఆమె దూరమయ్యారు. కాగా, జైలులో ఉంటూ ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లేమీ లేవు. అందులోనూ కవిత ఢిల్లీ

తీహార్ జైలులో ఉన్నారు.

కొసమెరుపు: కవితతో పాటే కొద్ది రోజులకు మార్చి 28న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. ఆయనకు 50 రోజుల అనంతరం బెయిల్ వచ్చింది. అనారోగ్య కారణాలను చూపినప్పటికీ, ఆప్ అధినేతగా ప్రచారానికి బెయిల్ ఇచ్చారు. కవితకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు.

Tags:    

Similar News