కామారెడ్డిలో తేడా కొడుతోందా...?
అపుడెపుడో ఎంటీయార్ చివరి నిముషంలో తీసుకున్న డెసిషన్ మూలంగా కల్వకుర్తిలో పోటీ చేశారు.
అపుడెపుడో ఎంటీయార్ చివరి నిముషంలో తీసుకున్న డెసిషన్ మూలంగా కల్వకుర్తిలో పోటీ చేశారు. 1989 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలు అయ్యారు. ఇపుడు చూస్తే బీయారెస్ అధినేత కేసీయార్ కూడా వ్యూహాత్మకంగానే బరిలోకి దిగారు అని అంటున్నా కామారెడ్డికి ఎందుకు వెళ్లి పోటీ చేసినట్లు అన్న దాని మీద ఓటర్లకు అయితే జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయారు అని అంటున్నారు.
పైగా కేసీయార్ గజ్వేల్ లో మీటింగ్ పెట్టి మాట్లాడుతూ ఈసారి గెలిస్తే తాను తప్పకుండా ప్రతీ నెలలో ఒక రోజు గజ్వేల్ లోనే పర్యటిస్తాను అని హామీ ఇచ్చేశారు. దాని భావమేంటి అంటే గజ్వేల్ తన పర్మెనెంట్ సీటు అని ఆయన చెప్పకనే చెప్పేసారు అని అంటున్నారు. దాంతోనే కామారెడ్డిలో లెక్కలు మారాయా అన్నది కూడా చర్చగా ఉంది.
ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేశారు. బీయారెస్ కి మూడు సార్లు ఓటేసి బోరెత్తిన ఓటర్లు చేయి గుర్తుకు ఓటెత్తారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి అయితే కేసీయార్ స్వయంగా కామారెడ్డిలో ఓటమి పాలు అవుతారని కూడా జోస్యం చెప్పేశారు. కట్టకట్టుకుని మరీ జనాలు అంతా బీయారెస్ ఓటమి కోసం పనిచేసాయని కూడా ఆయన అన్నారు.
ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు కామారెడ్డిలో ఏదో తేడా జరిగింది అని బీయారెస్ లో డౌట్లు ఉన్నాయట. కామారెడ్డిలో వర్గ పోరు కూడా బీయారెస్ కి చేటు చేసింది అని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి
టికెట్ మళ్లీ ఇవ్వవద్దు అని ఒక సెక్షన్ పోరు పెడితే ఆయనకు కూడా ఈసారి టికెట్ కాకుండా కామారెడ్డిలో గెలిచిన తరువాత కేసీయార్ తన కుమార్తె కవితకు ఆ సీటు ఇస్తారన్న ప్రచారం కూడా ప్రత్యర్ధులు చేశారు.
ఇలా చాలా కారణాలతో కామారెడ్డిలో బీయారెస్ కారు స్పీడ్ కి బ్రేకులు వేశారని అంటున్నారు మరో వైపు చూస్తే కామరెడ్డి ప్రజలు కూడా తెలివైన తీర్పునే చెప్పారని అంటున్నారు. కేసీయార్ కి గజ్వేల్ సొంత సీటు ఉంది. రేవంత్ రెడ్డికి సొంత సీటు కొడంగల్ ఉంది. ఈ ఇద్దరు నేతలలో ఎవరిని గెలిపించినా కామారెడ్డి సీటు ఉంచుకోరని ఉప ఎన్నికలు వస్తాయన్న బీజేపీ ప్రచారానికి కూడా జనాలు తలవొగ్గి కమలానికి ఓట్లు గుద్దారని ప్రచారమూ ఉంది.
ఇక కామారెడ్డిలో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్ధి కూడా ఆషామాషీ వ్యక్తి కారు. వెంకటరమణారెడ్డి పక్కా లోకల్ క్యాండిడేట్. ఆయన చాలా కాలంగా కామారెడ్డిలోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆయన పంట ఈసారి పండుతోంది అని అంటున్నారు. లోకల్ ని ఎన్నుకుంటే తమ ఎమ్మెల్యే వద్దకు సులువుగా పోవచ్చు అని, అలాగే ఉప ఎన్నికలు కూడా ఉండవని తలచి జనాలు బీజేపీకి ఓటేశారు అని అంటున్నారు. ఏది ఎలాగున్నా కామారెడ్డి ఫలితం మాత్రం ఉత్కంఠను రేకెత్తిస్తొంది.
మన దేశంలో పెద్ద నాయకులు ఓటమి సర్వ సాధారణం. ఇందిరా గాంధీ నుంచి ఎంటీయార్ వరకూ చాలా మంది ఓడారు. కేసీయార్ అయితే 1983లో టీడీపీ తరఫున సిద్ధిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత ఆయన ఓటమిని చూడలేదు. కానీ కామారెడ్డిలో ఏమి జరుగుతుంది అన్నది మాత్రం ఆసక్తిని రేపుతోంది.