ఎమ్మెల్యే కామినేనికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వరదలతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వరదలతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. భారీ ఎత్తున వరదలు ముంచెత్తడంతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు నివాసం ఉన్న ఇళ్ల పరిస్థితి ఏంటని తలచుకుంటూ ఏడుస్తున్నారు. పెద్ద ఎత్తున విపత్తు రావడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. వర్షాలు పడి వారం రోజులు గడిచినా ఇంకా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వ, అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యలకు దిగింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోకాలిలోతు నీటిలోకి దిగి బాధితుల కష్టాలు తెలుసుకున్నారు. విజయవాడ పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అక్కడే ఉండి ప్రజలకు సేవలందిస్తున్నారు.
అయితే.. తాజాగా బాధితులను పరామర్శించేందుకు బయలుదేరిన మాజీమంత్రి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఓ వాగు దాటుతుండగా.. ఒక్కసారికి అదుపుతప్పింది.
వరద తీవ్రత తగ్గకపోవడం.. బురదమయంగా ఉండడంతో వాహనం ఒక పక్కకు ఒరిగింది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమ్మెల్యేను వాహనం నుంచి కిందకు దింపారు. ఆలపాడు-కొల్లేటికోట రహదారి పూర్తిగా నీటమునిగిందని తెలియడంతో పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యే బయలుదేరారు. పందిరిపల్లిగూడెం గ్రామంలో ఆయన వాహనం ఇలా అదుపుతప్పింది.