పోలవరం ఫైళ్ల దహనంపై మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు!

అవును... ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో ఫైళ్లను కాల్చేశారనే విషయం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే

Update: 2024-08-18 12:52 GMT

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు తీవ్ర సంచలనంగా మారిన నేపథ్యంలో... తాజాగా పోలవరం ప్రాజెక్ట్ ఫైళ్లు దగ్దం అయ్యాయనే విషయం మరింత చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఫైళ్లను గుట్టుగా కాల్చేశారనే వార్తలు శనివారం సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.

అవును... ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో ఫైళ్లను కాల్చేశారనే విషయం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పైగా.. దగ్దమైన ఫైళ్లానీ పోలవరం ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ విభాగం ఫైళ్లని మీడియాలో కథనాలు హల్ చల్ చేశాయి. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అయితే... ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి... ఈ వ్యవహారంపై ఆ విభాగం సూపరింటెండెంట్ కుమారిని ప్రశ్నిస్తే అవన్నీ చిత్తు కాగితాలని చెప్పారని అన్నారు. ఇదే సమయంలో.. ఆర్డీవో శివజ్యోతి క్లారిటీ ఇచ్చారు. కొత్త బీరువాలు రావడంతో ఫైళ్లను వాటిలో సర్ధినప్పుడు రద్దును మాత్రమే బయటపడేసి కాల్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించారు.

ఇదే సమయంలో దగ్ధమైన ఫైల్స్ పోలవరం ఎడమ కాలువ పరిహారానికి సంబంధించినవి కావని ఆర్ & ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ కూడా క్లారిటీ ఇచ్చారు. తగులబెట్టిన కాగితాలు పనికిరానివని ఆమె స్పష్టం చేశారు. దీంతో... ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చినట్లయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... పోలవరం ఫైల్స్ దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలకు వెనుకాడబోమని అన్నారు. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన.. తగలబడిన ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... దహనమైన వాటిని ఆర్డీవో శివజ్యోతి పనికిరానివిగా ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు!

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారంటూ ఆయన విమర్శలు చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన సిబ్బందిని రక్షించవద్దని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చెన్నరాయుడికి సూచించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News