పోటీ చేసే స్థానం విషయంలో కందుల దుర్గేష్ కీలక ప్రకటన!

ఈ నేపథ్యంలో... తాజాగా ఈ విషయాలపై వీరవరంలోని జనసేన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో స్పందించిన దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. ఇందులో

Update: 2024-03-05 04:59 GMT

పొత్తులో భాగంగా టీడీపీ - జనసేన నేతల మధ్య జరుగుతున్న సీట్ల సర్ధుబాటు వ్యవహారాల్లో కొంతమంది నేతలు సవాళ్లు చేస్తూ, పార్టీ జెండాలు తగులబెడుతున్న వేళ... కొంతమంది నేతలు మాత్రం అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యం అంటూ ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ కీలక నేత కందుల దుర్గేష్ తాజాగా అటువంటి ప్రకటనే చేశారు. అధిష్ఠానం నిర్ణయించినట్లుగానే తాను పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్ అయ్యిందని తెలిపారు.

అవును... రాజమండ్రి రూరల్ టిక్కెట్ టీడీపీకా, జనసేనకా అనే చర్చ గతకొన్ని రోజులుగా తీవ్రంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ మోస్ట్ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఉండగా... జనసేన నుంచి కందుల దుర్గేష్ కూడా ఈ స్థానం నుంచే పోటీ చేయబోతున్నారని కథనాలొచ్చాయి. ఈ విషయంలో జనసైనికులు గట్టిగా పట్టుబట్టి నిరసనలు, ధర్నాలు కూడా చేశారు.

మరోపక్క రాజమండ్రి రూరల్ టిక్కెట్ తనదే అంటూ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో... తాజాగా ఈ విషయాలపై వీరవరంలోని జనసేన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో స్పందించిన దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... ఈ ప్రాంత యువత సామాజిక సేవలతో చూపిన ఆదరాభిమానాలు మరువలేనివని అన్నారు. తన వెన్నంటే ఉన్నవారికి కృతజ్ఞతలు అని తెలిపారు.

అనంతరం... వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోయే స్థానంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా... మరో రెండు మూడు రోజుల్లో తనను నిడదవోలు నుంచి పోటీచేయాలనే ప్రకటనను అధిష్టాణం జారీచేయనుందని.. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని.. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తనకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలు పార్టీ పెద్దలకు వదిలి.. తాను ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలిపారు.

దీంతో చాలా కాలంగా తీవ్ర సస్పెన్స్ ని కలిగించిన రాజమండ్రి రూరల్ టిక్కెట్ విషయంలో కన్ ఫర్మేషన్ వచ్చేసినట్లయ్యింది. దీంతో... రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి... టీడీపీ కంచుకోటగా పేరున్న నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేయబోతున్నారని ఫిక్సయిపోవచ్చు! ఇక అధికారిక ప్రకటనే తరువాయి!!

Tags:    

Similar News