'కపట్రాళ్ల' హత్య కేసులో దోషులు నిర్దోషులు.. ఏపీ హైకోర్టు

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మద్దిలేటి నాయుడుతో పాటు మరికొందరి మీద అప్పటి దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-07-07 07:32 GMT

ఉమ్మడి రాష్ట్రంలో చిట్టచివరి ఫ్యాక్షనిస్టుగా పేరున్న కపట్రాళ్ల వెంకటప్పనాయుడి హత్య కేసులో దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది. అత్యంత దారుణంగా హత్య చేయటం అప్పట్లో సంచలనంగా మారింది. దాదాపు పదిహేడుసార్లు హత్యయత్నాల నుంచి తప్పించుకున్న వెంకటప్పనాయుడు పద్దెనిమిదోసారి మాత్రం హత్యకు గురయ్యారు. సినిమాటిక్ తరహాలో ఆయన్ను హత్య చేసిన వైనం పెను సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలకు కారణమైన ఈ దారుణ హత్య 2008లో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో పాలెగారి వెంకటప్పనాయుడు.. మాదాపురం మద్దిలేటి నాయుడి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. 2008 మే 17న వాహనంలో కర్నూలుకు బయలుదేరిన వెంకటప్ప నాయుడితో పాటు మరో 10 మందిని భారీవాహనాలతో ఢీ కొట్టి.. బాంబులు విసిరి.. వేటకొడవళ్లతో అత్యంత దారుణంగా హత్య చేశారు.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా మద్దిలేటి నాయుడుతో పాటు మరికొందరి మీద అప్పటి దేవనకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ ఆదోని రెండో అదనపు జిల్లా.. సెషన్స్ కోర్టులో సాగింది. చివరకు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న 17 మంది నిందితులకు జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధిస్తూ 2014 డిసెంబరు 10న తీర్పు వచ్చింది. వివిధ సెక్షన్ల కింద మరికొందరు కూడా దోషులుగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో సదరు తీర్పును సవాలు చేస్తూ దోషులు అప్పట్లో హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. వీటిపై సుదీర్ఘ విచారణ సాగింది. తాజాగా అప్పీలుదారులను నిర్దోషులుగా ప్రకటిస్తూ శుక్రవారం ఏపీ హైకోర్టు తీర్పు వెలువడింది. కాస్తా ఆలస్యంగా వివరాలు బయటకు వచ్చాయి. నేర నిరూపణకు పోలీసులు కోర్టు ముందు ఉంచిన సాక్ష్యాధారాలు నమ్మశక్యంగా లేవని.. దోషుల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. దీంతో జీవితఖైదు పడిన 11 మంది దోషులను నిర్దోషులుగా ప్రకటించటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News