చంద్రబాబు, పవన్‌ లపై ఇదే పెద్ద బాధ్యత!

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Update: 2024-06-26 16:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జనసేన మద్దతే కీలకమైంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక హోదా సాధించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు ఈ డిమాండ్‌ ను వినిపిస్తుండగా తాజాగా ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్‌ కూడా ఈ జాబితాలో చేరారు.

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై పెద్ద బాధ్యత ఉందని.. వీరిద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని కేఏ పాల్‌ కోరారు. ప్రత్యేక హోదాతో పోలిస్తే మిగతావన్నీ చాలా చిన్న విషయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రంలో కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాయని.. దీనివల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చని కేఏ పాల్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక హోదా సాధించుకురావాలని కోరారు.

Read more!

అదేవిధంగా రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని గతంలో పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారని కేఏ పాల్‌ గుర్తు చేశారు. తనకు కేంద్ర నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయని పవన్‌ చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో అదృశ్యమైన మహిళలు ఏమయ్యారో ఆయన తెలుసుకోవాలన్నారు. అదృశ్యమైన మహిళలను ఇంటికి చేర్చి ఆ కుటుంబాలకు పవన్‌ కళ్యాణ్‌ ఆనందం కలగజేయాలని కేఏ పాల్‌ కోరారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ నెరవేర్చాలని కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల ముందు జగన్‌ ను విమర్శించారని.. ఇప్పుడు ఎన్నికలు అయ్యిపోయాక కూడా ఇంకా జగన్‌ ను విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. కక్ష సాధింపు చర్యల కోసం ప్రజలు అధికారం ఇవ్వలేదనే విషయాన్ని చంద్రబాబు, పవన్‌ గుర్తించాలని కేఏ పాల్‌ కోరారు.

ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా తీసుకురావాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేత వైఎస్‌ జగన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్, జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌ కుమార్, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ తదితరులు ప్రత్యేక హోదా డిమాండ్‌ ను వినిపించారు. ఇప్పుడు తాజాగా ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్‌ వీరికి జత కలిశారు.

అయితే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం ఎప్పుడో అటకెక్కించేసింది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాకుండా బీహార్, ఒడిశా తదితర రాష్ట్రాలు సైతం తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తుండటమే ఇందుకు కారణం. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా అనేది ప్రశ్నార్థకమే!

Tags:    

Similar News