అంత చిన్న విషయం కపిల్ సిబల్ కు గుర్తు లేకపోవటమేంటి?
ప్రస్తుతం స్వతంత్ర సభ్యుడిగా వ్యవహరిస్తున్న కపిల్ సిబల్.. వక్ప్ బిల్లుపై మాట్లాడారు.;

కపిల్ సిబల్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. అంతకు మించి ఆయనో ప్రముఖ న్యాయవాది. సుప్రీంకోర్టులో కీలక కేసుల్ని వాదించే ఆయనకు చట్టాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వేలు కొసరులోనూ చట్టాలు.. సెక్షన్లను ఇట్టే చెప్పగలరు. అలాంటి ఆయనకు ఇప్పటికే ఉన్న కీలక చట్టాల గురించి చెప్పాల్సిన రావటమంటి? విన్నంతనే విస్మయానికి గురి చేసే ఈ ఉదంతం రాజ్యసభలో చోటు చేసుకుంది.
ప్రస్తుతం స్వతంత్ర సభ్యుడిగా వ్యవహరిస్తున్న కపిల్ సిబల్.. వక్ప్ బిల్లుపై మాట్లాడారు. ముస్లిమేతరులు సైతం వక్ఫ్ విరాళాలు ఇచ్చే హక్కు ఉందన్నారు. ‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయటానికి మీరెవరు?’ అని సూటిగా ప్రశ్నించారు. హిందువులు.. వక్ఫ్ విరాళాలు ఇవ్వటమే కాదు.. స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేశారన్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే పలు హైకోర్టులు సమర్థించాయన్న కపిల్ సిబల్.. తన వాదనను వినిపించే సమయంలో ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైనే భూములు ఉన్నాయని చెబుతూ.. ‘హిందూ మతంలో స్వార్జిన ఆస్తిని కొడుకులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలుగా చట్టాన్ని మార్చండి’ అని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఆస్తిని ఇచ్చేందుకు వీలుగా మన చట్టాలు ఉన్నాయని గుర్తు చేశారు. కపిల్ సిబల్ లాంటి మేధావికి ఈ చిన్న విషయం ఎందుకు గుర్తు లేదు? మర్చిపోయేంత విషయం కాదు కదా? న్యాయ అంశాల మీద కనీస అవగాహన ఉండే సాదాసీదా ప్రజలకు సైతం గుర్తుండే ఈ అంశం కపిల్ సిబల్ లాంటి వారికి గుర్తు లేకపోవటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.