జగన్ ఓటమి పవన్ టార్గెట్...కాపుల అజెండా ఏమిటి...!?
ముద్రగడ పద్మనాభం పవన్ కి లేఖ రాసిన దాంట్లో ఇదే ఉంది. ఆయన 80 సీట్లు డిమాండ్ చేయాల్సింది అన్నారు. హరి రామజోగయ్య అదే అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా హీరోగా ఉంటూ రాజకీయాల్లోకి మళ్ళిన వారిగా చెప్పాలి. ఆయన రొటీన్ పొలిటీషియన్ గా కంటే భిన్నంగా ఆలోచిస్తారు అని చెప్పాలి. పొలిటీషియన్ ఆలోచనలు అయితే కచ్చితంగా నాకేంటి అన్నది ఉంటుంది. అదే ఫస్ట్ ప్రయారిటీగా ఉంటుంది. రాజకీయాల్లో గెలుపు ఓటమి పక్కపక్కనే ఉంటాయి. ఓటమి నుంచే గెలుపు తీసుకోవాలి. ఈ రెండూ ఒకరికే దక్కవచ్చు. లేదా ఇద్దరు పంచుకోవచ్చు.
అంటే ఒకరిని ఓడించడంలో గెలుపు ఒకరు చూసుకుంటే ప్రత్యర్ధి ఓటమిని ఆస్వాదించే వారుగా మరొకరు ఉంటారు. ఇపుడు టీడీపీ జనసేన కూటమిలో చూస్తే గెలుపు చూసేందుకు చంద్రబాబు ఆరాటపడుతూంటే జగన్ ఓటమే తన గెలుపు అని పవన్ భావిస్తున్నారు. దాంతో ఈ ఇద్దరి పొత్తు సాధ్యమైంది.
నిజానికి రాజకీయాల్లో ఇలాంటివి చాలా అరుదుగా ఉంటాయి. కానీ పవన్ చంద్రబాబు మాత్రం ఇలా గెలుపు ఓటములను పంచుకున్నారు. ఇదే ఇపుడు పవన్ కి ఆయన వెంట ఉన్న ఒక బలమైన సామాజిక వర్గానికి మధ్య అంతరాన్ని సృష్టిస్తోంది. పవన్ జగన్ ఓడితే చాలు అనుకుంటున్నారు. కానీ ఆయన్ని బలంగా సమర్ధించే కాపులు మాత్రం జగన్ ఓటమితో పాటు పవన్ కూడా గెలవాలని కోరుకుంటున్నారు. ఆ గెలుపు కేవలం ఎమ్మెల్యేగానో లేక మంత్రిగానో కాదు, ఏకంగా సీఎం గానే ఉండాలని వారు ఆకాక్షిస్తున్నారు.
తమ చిరకాల కోరిక అయిన కాపులు సీఎం కావాలన్నది పవన్ నెరవేర్చాలని వారు భావిస్తున్నారు నిజానికి వారి కోరిక సహజమైనది ధర్మం అయినది. కానీ పవన్ మాత్రం సగం వరకే చూస్తున్నారు. జగన్ ఓటమితో చాలు అనుకుంటున్నారు. కానీ సంపూర్ణ విజయం తమకే దక్కాలన్నది కాపుల డిమాండ్ గా ఉంది.
ఇక ఏపీలో సామాజిక రాజకీయ నేపధ్యం చూసినపుడు గతంలో ఎన్నడూ లేని విధంగా కాపులు సీఎం అయ్యేలా వాతావరణం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కర్నాటకలో కుమారస్వామి సీఎం అయ్యే విధంగా పవన్ కూడా ముఖ్యమంత్రి అయ్యేలా వాతావరణం ఉంది. దానికి పవన్ చేయాల్సింది వ్యూహం ప్రకారం రాజకీయాలు నడపడమే.
ఈ రోజున టీడీపీకి జనసేన అవసరం ఉంది. జనసేన బలం ఎంత అని కాదు, టీడీపీ కంటే పెద్ద పార్టీ అని కాదు, కానీ టీడీపీతో జనసేన కలిస్తేనే ఆ పార్టీకి విజయం దక్కుతుంది. టీడీపీకి నలభై శాతం పైగా ఓటు షేర్ ఉన్నా ఆ మిగిలిన ఓటు షేర్ జనసేన కలిపితేనే వైసీపీని ఓడించే బలం వస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఎక్కువ సీట్లకు డిమాండ్ చేయమని కాపులు కోరుతున్నారు.
ముద్రగడ పద్మనాభం పవన్ కి లేఖ రాసిన దాంట్లో ఇదే ఉంది. ఆయన 80 సీట్లు డిమాండ్ చేయాల్సింది అన్నారు. హరి రామజోగయ్య అదే అన్నారు. ఇలా చేయడం వల్ల ఏపీలో తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. చంద్రబాబు పవన్ చెరిసగం అధికారం పంచుకోవడానికి వీలు చిక్కుతుంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వల్ల ఓట్ల బదిలీ కూడా సాఫీగా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుంది.
అలా కాదు అనుకుంటేనే చిక్కులు. ఇపుడు పవన్ తన ఆలోచనలు చెప్పేశారు. తాడేపల్లిగూడెం సభ సాక్షిగా ఆయన మనకు బలం లేదు అన్నారు. జగన్ ని దించేస్తే ఈసారికి చాలు అన్నది ఆయన విధానంగా చెప్పకనే చెప్పారు. అంటే చంద్రబాబు అనుభవం, ఆయన రాజకీయ దురంధరత తో ఈసారి ఆయనే సీఎం అవుతారు అన్నట్లుగానే ఆయన స్పీచ్ సాగింది.
ఈసారి ఎక్కువ సీట్లు తెచ్చుకుని బలంగా అసెంబ్లీలోకి అడుగుపెడితే 2029 నాటికి చూసుకోవచ్చు అన్నది పవన్ ఆలోచన. కానీ రాజకీయాల్లో ఈ రోజుకి ఈ రోజే తేల్చుకోవాలి. పైగా కళ్ళ ముందు అవకాశం ఉంది. 2029 అంటే అప్పటికి వైసీపీతో పాటు టీడీపీతోనూ జనసేన ఫైట్ చేయాల్సి ఉంటుంది. అలా రెండు పార్టీలతో పోరాడి అధికారంలోకి రావడం అంటే కుదిరేది కాదు.
మరి పవన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో కానీ ఏపీలో భవిష్యత్తు జనసేనదే కాబట్టి తొందర ఎందుకు అన్నట్లుగా ఉంది. కానీ ఇక్కడే కాపు సామాజిక వర్గంతో పాటు జనసేనలోని క్యాడర్ పవన్ ఆలోచనలతో విభేదిస్తోంది. జగన్ ఓటమికి అంతా పవన్ తో ఏకీభవిస్తున్నా జగన్ ఓడించిన తరువాత దక్కే అధికార ఫలంలో సమాన వాటా జనసేనకు కూడా దక్కాలన్నదే వారి డిమాండ్. దాంతో పవన్ ది ఒక ఆలోచన అయితే కాపులది మరో ఆలోచనగా ఉంది.
ఈ అంతరం, ఈ సంక్లిష్టత వచ్చే ఎన్నికల్లో అసలు జగన్ ని ఓడిస్తుందా అన్నది సందేహంగా కనిపిస్తుంది. తమ నేత సీఎం కాలేనపుడు అధికారంలో వాటా దక్కనపుడు జగన్ ని ఓడించి ఏమిటి లాభం అనుకుంటే మాత్రం మొత్తం చెడుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఓటమి లోనే తన గెలుపు చూసుకునే పవన్ ఆలోచనలో మార్పు వస్తేనే అది కూటమి విజయానికి కాపుల దశాబ్దాల కోరిక గెలుపునకు కూడా దోహదపడుతుంది అని అంటున్నారు.