పాపం మగాళ్లు.. ఫ్రీ పేరుతో భార్యల చార్జీలనూ వారే చెల్లిస్తున్నారు!

బలమైన బీజేపీ నాయకత్వం ఉన్నప్పటికీ కన్నడ నాట కమలాన్ని హస్తం ఓడించిందంటే ప్రధాన కారణం.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు

Update: 2025-01-03 15:30 GMT

దక్షిణాదిలో కాంగ్రెస్ ను మళ్లీ నిలబెట్టిన రాష్ట్రం కర్ణాటక. బలమైన బీజేపీ నాయకత్వం ఉన్నప్పటికీ కన్నడ నాట కమలాన్ని హస్తం ఓడించిందంటే ప్రధాన కారణం.. ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు. వీటిలో మరీ ప్రధానమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే, మూడు నెలల కిందట ఈ పథకంపై తీవ్రమైన రగడ జరిగింది. అలవి కాని హామీ ఎందుకు ఇచ్చారంటూ సాక్షాత్తు కర్ణాటకకే చెందిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర నేతలపై మండిపడ్డారు. ఇప్పుడు మరోసారి ఆర్టీసీ బస్సు ప్రయాణం వార్తల్లో నిలిచింది.

2023 మే నెలలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీని ఓడించి మరీ ఆ పార్టీ గెలిచింది. ఇందులో బీజేపీ సర్కారు వైఫల్యాలతో పాటు ఆరు గ్యారెంటీల (బస్సు పథకం) పాత్ర కూడా చాలా ఉంది. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక సర్కారు బస్సు చార్జీలను 15 శాతం పెంచింది. ఆదివారం 5 నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

రోజువారీ వ్యయం ప్రస్తుతం రూ.13.12 కోట్లకు చేరిందని.. ఉద్యోగుల కోసం చేసే వ్యయం రూ.12.95 కోట్ల నుంచి రూ.18.36 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక భారం తగ్గించేందుకు ధరల పెంపు తప్పదని స్పష్టం చేసింది.

తెలంగాణతో పోలిస్తే చార్జీలు తక్కువే..

సర్కారుపై గ్యారంటీల భారం అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలు సర్వత్రా విమర్శలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలతో పోలిస్తే చార్జీలు తక్కువగానే ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం సమర్థించుకుంటోంది.

‘శక్తి’హీనం

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితికి మించి స్కీముల అమలు చివరకు ‘శక్తి’హీనం చేస్తుందని కర్ణాటకను ఉదాహరణగా చూపుతున్నారు నిపుణులు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వారానికి రూ.4 వేల కోట్లు అప్పు చేయనుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్లు అప్పు తెస్తుందని భావిస్తున్నారు. ఐదు గ్యారెంటీల అమలుకు ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతోంది కాంగ్రెస్ కర్ణాటక సర్కారు.

ఇప్పుడు బస్సు చార్జీల పెంపును కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న బై వన్ గెట్ వన్ గా బీజేపీ ఎద్దేవా చేస్తోంది. ఇక పాపం మగాళ్లు.. ఫ్రీ పేరుతో భార్యల చార్జీలనూ వారే చెల్లిస్తున్నారు అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచంలో ఏదీ ఉచితంగా రాదని.. వాటికి ఆశపడితే జేబుకు చిల్లు తప్పదని మరికొందరు వేదాంతం వల్లిస్తున్నారు.

Tags:    

Similar News