కర్ణాటకలో సీఎం మార్పు..? అప్పుడే మొదలైన కాంగి‘రేసు’

దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఘన విజయం సాధించిన రాష్ట్రం కర్ణాటక. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి వారి నాయకత్వంలో.. కాంగ్రెస్ కర్ణాటకను హస్తగతం చేసుకుంది.

Update: 2024-08-31 11:42 GMT

దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై ఘన విజయం సాధించిన రాష్ట్రం కర్ణాటక. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి వారి నాయకత్వంలో.. కాంగ్రెస్ కర్ణాటకను హస్తగతం చేసుకుంది. అయితే, కర్ణాటక నేతలంటేనే వారిచుట్టూ కేసుల ఉచ్చు ఉంటుంది. యడియూరప్ప, కుమారస్వామి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇలా అందరూ రాజకీయ ప్రేరేపిత కేసుల్లో చిక్కుకున్నవారే. తాజాగా సిద్ధరామయ్యను ముడా స్కా వెంటాడుతోంది. కోల్పోయిన భూమికి గాను పరిహారంగా మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) నుంచి విలువైన భూమిని సిద్ధు భార్య పొందారనేది ఈ కేసు. దీనికితోడు వాల్మీకి కార్పొరేషన్ స్కాం. దీంతో సిద్ధును కాంగ్రెస్ అధిష్ఠానం తప్పిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ముడా స్కాంలో ఆయనపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడంతో కథ మలుపుతిరిగింది.

ఆ రెండు స్కాంలు కాదు.. మరోటి..

కర్ణాటకలో ముడా, వాల్మీకి కార్పొరేషన్ స్కాంలే కాక.. మరోటి కూడా సిద్దు మెడకు చుట్టుకుంటోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే.. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు చెందిన ట్రస్ట్ సిద్ధార్థ విహారకు రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా 5 ఎకరాలు కేటాయించడం. బెంగళూరుకు సమీపంలోని హైటెక్‌ డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ పార్క్‌ లో కర్ణాటక ఇండస్ట్రియల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ బోర్డు భూమి ఇది. దీనిని పొందేందుకు ఖర్గే కుటుంబం ఏరోస్పేస్‌ ఆంత్రప్రెన్యూర్ గా మారిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది ప్రజా సౌకర్యాల కోసం ఉద్దేశించిన భూమి అని.. ఎస్సీ కోటా కింద పొందారని చెబుతోంది. సిద్ధార్థ విహార ట్రస్ట్ ట్రస్టీలుగా ఖర్గే ఆయన భార్య రాధాభాయ్‌, కుమారులు ప్రియాంక్‌ ఖర్గే, రాహుల్‌ ఖర్గే, అల్లుడు, గుల్బర్గా ఎంపీ రాధాకృష్ణ కావడం గమనార్హం.

ఇక వాల్మీకి కార్పొరేషన్‌ లో రూ.187 కోట్ల కుంభకోణంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ఇందులో లింకులున్నాయని బీజేపీ అంటోంది. దీంతో ఈడీ, సీబీఐ, సిట్‌ అధికారులు కర్ణాటక వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. దీంతో కార్పొరేషన్‌ సూరింటెండెంట్‌ చంద్రశేఖరన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. విపక్షాల ఒత్తిడితో సీఎం సిద్ధరామయ్య విచారణకు సిట్‌ వేశారు. కాగా, తెలంగాణలోనూ వాల్మీకి కార్పొరేషన్ స్కాం ప్రకంపనలు రేపుతోంది. రూ.180 కోట్లలో లోక్ సభ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ లోని 9 బ్యాంక్‌ అకౌంట్లకు 45 కోట్లు బదిలీ అయ్యయాని బీఆర్ఎస్‌ ఆరోపిస్తోంది.

సీఎంను మారుస్తారా?

కర్ణాటక గవర్నర్‌ ఇప్పటికే సీఎంపై విచారణకు ఆదేశించి ఉండడంతో ఆయనను తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి గత ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం కర్ణాటక సీఎం పదవి కోసం సిద్ధు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పోటీ పడ్డారు. అధిష్ఠానం అహింద సిద్ధాంతకర్త, బీసీ నాయకుడు అయిన సిద్ధును రెండున్నరేళ్లు, శివకుమార్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండేలా ఒప్పందం చేసింది. కానీ, ఏడాదిన్నర లోపే ఇప్పుడు దిగిపోవాల్సిన పరిస్థితి వస్తోందా? అనిపిస్తోంది. అయితే, డీకే తో పాటు హోం మంత్రి పరమేశ్వర కూడా సీఎం పదవికి పోటీ పడుతున్నారు. తనవర్గం వారిచేత పరమేశ్వర ఈ మేరకు ప్రకటనలు ఇప్పిస్తున్నారు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు