దేవుడే దిగివచ్చినా మార్పు సాధ్యం కాదు!... డిప్యూటీ సీఎం షాకింగ్!
బెంగళూరు నగర రహదారుల సమస్యపై చర్యలు చేపట్టడానికి ఉప్క్రమించినట్లు చెబుతున్న వేళ.. కర్ణాటక డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు పేరు చెబితే ప్రధానంగా గుర్తుకువచ్చే వాటిలో ట్రాఫిక్ సమస్య ఒకటనే సంగతి తెలిసిందే. అది పేపర్లలో చదివి, ఛానల్స్ లో చూసేవారికంటే.. స్వానుభవం చెందినవారికి పరిపూర్ణమైన స్పష్టతతో అర్ధమవుతుంటుందని అంటారు. ఆ స్థాయిలో సమస్య ఉన్న వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి ఆసక్తిగా మారాయి.
అవును... బెంగళూరు నగర రహదారుల సమస్యపై చర్యలు చేపట్టడానికి ఉప్క్రమించినట్లు చెబుతున్న వేళ.. కర్ణాటక డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ప్రధాన రహదారులతో పాటు ఫుట్ పాత్ లు, వాటి పొడవునా మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. రోడ్లకు మంచి రూపునివ్వడానికి అవసరమైన పథకాలను సిద్ధం చేయాలని అన్నారు.
బెంగళూరు పాలికే ఆఫీసులో "నమ్మ రస్తా" అనే అంశంపై సెమినార్, వస్తు - ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... రెండు మూడేళ్లలో బెంగళూరును మార్చేస్తామంటే సాధ్యం కాదని.. దేవుడే దిగివచ్చినా అంత భారీ మార్పు అసాధ్యమని.. పక్కా ప్రణాళికతో క్రమబద్ధంగా మార్పులు సాధించాలని సూచించారు.
ఇదే సమయంలో... సురక్షితంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, బస్ షెల్టర్లు, జంక్షన్ లను సుందరంగా తీర్చిదిద్దాలని.. ప్రతీ రోడ్డు, ఫుట్ పాత్ మార్గాలు ఏకరూపంలో ఉండాలన్నది సర్కార్ ఆలోచన అని వివరించారు. ఇదే సమయంలో.. బయట కనబడే కేబుల్ తీగలను కత్తిరించేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భయం గొలుపుతూ కనిపించే వైర్లు ఇకపై కనిపించకూడదని తెలిపారు.
ఇదే సమయంలో ప్రధానంగా రోడ్లకు ప్రత్యామ్న్యాయంగా అండర్ గ్రౌండ్ మార్గాల నిర్మాణం అనేది బెంగళూరు నగరంలో పెద్ద సవాళ్లతో కూడుకున్నదని.. సిటీలో సుమారు 17 వందల కిలోమీటర్ల రోడ్లు "వైట్ టాపింగ్" చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే... రెండు మూడేళ్లలో బెంగళూరును మార్చేస్తామంటే దేవుడే దిగివచ్చినా అసాధ్యమని అన్నారు.