ఫ్రీ అని చెప్పి ఛార్జీల వాతలు అవసరమా?

చివరకు ఇదే పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తుండటం.. త్వరలో ఏపీలోనూ స్టార్ట్ చేస్తుండటం తెలిసిందే.

Update: 2025-01-03 04:16 GMT

ప్రయోగాత్మకంగా ఒక రాష్ట్రంలో మొదలైన ఒక సంక్షేమ పథకం సూపర్ హిట్ కావటమే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ ఆ పథకాన్ని అమలు చేయటానికి ప్రయత్నిస్తున్న వేళ.. అలాంటి పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం మరెంత జాగ్రత్తగా దాన్ని అమలు చేయటంతో పాటు.. విమర్శలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లుగా కనిపించట్లేదు. దేశంలోనే తొలిసారి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించటం తెలిసిందే. ఈ పథకానికి వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు.

చివరకు ఇదే పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తుండటం.. త్వరలో ఏపీలోనూ స్టార్ట్ చేస్తుండటం తెలిసిందే. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికలకు వెళ్లే వేళలో.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించే పథకాన్ని హామీగా ఇచ్చేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఇదిలా ఉంటే..ఈ పథకాన్ని ప్రారంభించిన సిద్ధరామయ్య ప్రభుత్వం మాత్రం.. ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంపునకు సిద్ధమైంది. దాదాపు 15 శాతం మేర ఛార్జీలను పెంచాలని డిసైడ్ అయ్యింది. ఈ ఛార్జీల పెంపు జనవరి 5 నుంచి అమల్లోకి రానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఈ పెంపు తర్వాత రోజుకు రూ.7.84 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ ఛార్జీల పెంపు కర్ణాటకలోని ఆర్టీసీకి చెందిన నాలుగు సంస్థల్లోనూ అమలు కానున్నట్లు చెబుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మహిళలకు శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని అమలు చేయటం కోసం ప్రతి నెలా ఒక్కోకార్పొరేషన్ కు రూ.104 కోట్ల చొప్పున.. మొత్తం నాలుగు ఆర్టీసీ కార్పొరేషన్లకు రూ.417కోట్లు ఖర్చు అవుతోంది. దీంతో.. ఈ లోటును పూడ్చుకునేందుకు 15 శాతం బస్సు ఛార్జీలను పెంచుకోవటం ద్వారా శక్తి పథకం ద్వారా వచ్చే నష్టాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నారు.

అయితే.. ఒక సూపర్ హిట్ అయిన సంక్షేమ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాల్సింది పోయి.. ఛార్జీల పెంపుతో ప్రజల్లో వ్యతిరేకతను తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందన్న మాట వినిపిస్తోంది. శక్తి పథకం కారణంగా వచ్చే నష్టాన్ని మరో రూపంలో భర్తీ చేసుకోవాల్సింది పోయి.. ఛార్జీల పెంపు ఏమిటన్న పశ్న తలెత్తుతోంది. దేశం మొత్తంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వేళ్ల మీద లెక్కేసే లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. కాస్తంత తెలివిని ప్రదర్శించటం పోయి. ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ వాదనకు తగ్గట్లే బీజేపీ నేతలు తాజా పెంపు నిర్ణయంపై మండిపడుతున్నారు.

Tags:    

Similar News