క‌ర్ణాట‌క సెక్స్ వీడియోల కేసులో యూట‌ర్న్‌.. డీకే శివ‌కుమార్ చుట్టూ ఉచ్చు!

డీకే శివ‌కుమార్ కుట్ర కార‌ణంగానే స‌ద‌రు సెక్స్ వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని.. బీజేపీ నేత దేవ‌రాజె గౌడ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు.

Update: 2024-05-18 14:30 GMT

క‌ర్ణాట‌క‌లో వెలుగు చూసిన‌.. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ మ‌న‌వ‌డు, హాస‌న్ ఎంపీ ప్ర‌జ్వ‌ల్ సెక్స్ వీడియోల కేసు కీల‌క‌మైన యూట‌ర్న్ తీసుకుంది. వీడియోలు తీయ‌డం ఒక నేర‌మైతే.. దీనిని బ‌య‌ట పెట్ట‌డం.. సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం.. మ‌రో నేరంగా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు మూడు రూపాల్లో కేసులు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఈ ప‌రిణామంలో కాంగ్రెస్ నేత‌, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది.

డీకే శివ‌కుమార్ కుట్ర కార‌ణంగానే స‌ద‌రు సెక్స్ వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని.. బీజేపీ నేత దేవ‌రాజె గౌడ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఇక్క‌డ రెండు విష‌యాల‌ను ఆయ‌న చెప్పుకొచ్చారు. నేరుగా డీకే శివ‌కుమార్ త‌న‌ను సంప్ర‌దించార‌ని చెప్పారు. ఒక‌టి సెక్స్ వీడియోల‌ను బ‌య‌ట పెట్ట‌డం.. రెండోది ఈ వీడియోల‌ను అడ్డు పెట్టుకుని రాజ‌కీయంగా మాజీసీఎం కుమార‌స్వామిని అణిచేయాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్టు తెలిపారు.

దీనికి సంబంధించి త‌న‌కు 100 కోట్ల రూపాయ‌లు ఇస్తామ‌ని హామీకూడా ఇచ్చిన‌ట్టు దేవ‌రాజె చెప్పుకొ చ్చారు. దీనిలో భాగంగా త‌న‌కు రూ.5 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చార‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది. తాను బౌరింగ్ క్లబ్ రూమ్‌ నంబర్ 110లో ఉన్న సమయంలో ఒకరిని పంపించారని, ఆయన‌ద్వారానే త‌న‌కు రూ.5 కోట్లు ఇచ్చార‌ని తెలిపారు. ''100 కోట్లు ఇస్తాననే డీల్‌కు సంబంధించి ఆడియో రికార్డింగ్స్ తన వద్ద ఉన్నాయి. ఆ ఆడియో రికార్డింగ్స్ రిలీజ్ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది'' అని తెలిపారు.

సెక్స్ వీడియోల కేసులో ప్ర‌ధాన నిందితుడుగా భావిస్తున్న ఎంపీ ప్ర‌జ్వ‌ల్ కారు డ్రైవ‌ర్‌ను కూడా.. డీకే శివ‌కుమార్ భ‌య‌పెట్టారని, ఆయ‌న ద్వారానే సెక్స్ కేసుకు సంబంధించిన పెన్ డ్రైవుల‌నుతీసుకుని.. వాటిని సోష‌ల్ మీడియాలో పెట్టార‌ని.. అప్పుడే అది వివాదం అయింద‌ని.. ఇదంతా ఎన్నిక‌ల కుట్ర అని దేవ‌రాజె చెప్పుకొచ్చారు. ఈ వ్య‌వ‌హారంలో డీకే తోపాటు చెలువరాయస్వామి, కృష్ణ బైరె గౌడ్, ప్రియాంక్ ఖర్గే వంటి మంత్రులు కూడా ఉన్నార‌ని బాంబు పేల్చారు. మొత్తానికి సెక్స్ వీడియోల కేసులో రోజుకొక ట్విస్టు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News