మహిళా మంత్రికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మహిళా మంత్రితో పాటు.. ఆమె సోదరుడు కం ఎమ్మెల్సీ అయిన చెననరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు.
రోడ్డున పోయే కుక్కను తప్పించబోయిన క్రమంలో చెట్టును ఢీ కొంది కర్ణాటక రాష్ట్ర మహిళా మంత్రి కారు. ఈ ఉదంతంలో ఆమె తలకు.. వెన్నుముకకు గాయాలయ్యాయి. పెను ప్రమాదం త్రుటిలో తప్పిన ఈ ఘటన వివరాలు చూస్తే.. కర్ణాటక రాష్ట్ర మహిళా.. శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న లక్ష్మి హెబ్బాళ్కర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో మహిళా మంత్రితో పాటు.. ఆమె సోదరుడు కం ఎమ్మెల్సీ అయిన చెననరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యంతోనో.. విపరీతమైన వేగంతోనో కాకుండా.. హటాత్తుగా రోడ్డు మీదకు వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో వీరి వాహనం చెట్టును ఢీ కొంది.
ఈ ప్రమాదంలో మహిళా మంత్రి సోదరుడికి స్వల్ప గాయాలు కాగా.. మంత్రికి మాత్రం వెన్నుముక.. తలకు గాయాలైనట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా వీరి వాహనం ముందు భాగం మాత్రం భారీగా దెబ్బతింది. సకాలంలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటంతో.. పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు.