కాసాని ఆవేశం బీయారెస్ ఆయుధం...?

ఇక బీయారెస్ లో అయితే ముదిరాజ్ కమ్యూనిటీకి పెద్దగా ప్రాధాన్యత లేదని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో కాసాని వంటి బలమైన నేతను తమ వెంట ఉంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

Update: 2023-10-30 16:34 GMT

తెలంగాణా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది అంటున్నారు. తాను ఎందుకు టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్నాను అని ఆత్మ విమర్శ చేసుకున్నారు. అంతే ఆ వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసేసారు. పార్టీ అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. లేకపోతే అది ఎందుకు దానికి ప్రెసిడెంట్ ఎందుకు అని ఆయన మీడియా ముందే నిర్వేదం చెందారు.

కాంగ్రెస్ కి మద్దతు ఇద్దామని టీడీపీలో ఒక బలమైన సామాజిక వర్గం అంటోందని ఉన్న మాటను బయటకు అనేశారు కాసాని. అలా వేరే పార్టీకి మద్దతు ఇస్తూ పోవడానికి టీడీపీ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆ సామాజికవర్గం తెలంగాణాలో టీడీపీని నిలబెట్టాల్సింది లేకపోతే కాంగ్రెస్ కి మద్దతు అనడం వల్లనే తాను తప్పుకుంటున్నాను అని ఆయన రాజీనామా అనేశారు.

సరిగ్గా ఏడాదిన్నర క్రితం కాసాని టీడీపీలో చేరారు. ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన కాసాని తన సొంత డబ్బు వెచ్చించారని అంటున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంది. తన కుమారుడికి కూడా రాజకీయ భవిష్యత్తు కల్పించాలని మరో ఆశ ఉంది.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలంటే కాసాని వచ్చిన తరువాతనే తెలంగాణాలో టీడీపీలో కాస్తా కదలిక వచ్చింది. తొలి మీటింగ్ ఖమ్మంలో పెడితే అదిరిపోయే రేంజిలో సౌండ్ చేసింది. చంద్రబాబు అయితే ఈసారి అన్ని సీట్లకూ పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే బాబు అరెస్ట్ కావడంతో సీన్ మొత్తం మారింది. దాంతో పోటీకి అధినేత నో చెప్పేశారు.

రెండు సార్లు రాజమండ్రీ జైలుకు ములాఖత్ అయి బాబుని కలసినా ఆయన వద్దు అనేసారు. ఒక విధంగా బలమైన సామాజిక వర్గం టీడీపీ అనుకూల మీడియా వాదనలతో బాబు ఏకీభవించారని అంటున్నారు. ఇక ఇదే విషయాన్ని కాసాని ప్రకటించేసరికి తెలంగాణా టీడీపీ నేతలు ఖంగు తిన్నారు. సొంతంగా తామే పోటీ చేయాలని వారు భావించారు. అయితే అది సాధ్యపడే విషయం కాదు కాబట్టే కాసాని తానే తప్పుకున్నారు.

ఇక కాసాని ఏ పార్టీలో చేరుతారు అన్నది చర్చ. కాంగ్రెస్ కి ఒక వర్గం మద్దతు ఇవ్వాలని కోరిందని అది సబబు కాదని ఆయన అనడం బట్టి చూస్తే బీయారెస్ వైపు వెళ్తారా అన్న చర్చ మొదలైంది. మరో వైపు కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు ఉన్నాయి. మల్కాజ్ గిరీ లోక్ సభ సీటు తో పాటు ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు చూస్తామని కూడా హామీలు ఉన్నాయి.

ఇక బీయారెస్ లో అయితే ముదిరాజ్ కమ్యూనిటీకి పెద్దగా ప్రాధాన్యత లేదని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో కాసాని వంటి బలమైన నేతను తమ వెంట ఉంచుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అలా కాసానిని ముందు పెట్టి అటు సామాజిక వర్గం ఓట్లను పొందడంతో పాటు ఇటు చంద్రబాబు లోపాయికారీ కాంగ్రెస్ రాజకీయాన్ని ఆయన చేతనే ఎండగట్టించాలని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు అని అంటున్నారు.

ఇక బీయారెస్ అధినాయకత్వం అయితే నేరుగా చంద్రబాబుని విమర్శించలేదు. బాబు సామాజిక వర్గం ఓట్లు ఎన్నో కొన్ని కావాల్సి ఉంది కాబట్టి అది ఒక వ్యూహం అని అంటున్నారు. అందువల్ల కాసాని ఇదీ అసలు విషయం టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ తో లోపాయి కారి పొత్తుకు వెళ్ళింది అని చెప్పించడం ద్వారా కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీయాలని ఒక ప్లాన్ ఉందని అంటున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని మరో మారు చంద్రబాబు తెలంగాణా మీద తన ప్రభావం పరోక్షంగా చూపిస్తారు అని కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి కాసాని బీయారెస్ కి ఆయుధం అవుతారా లేక కాంగ్రెస్ గూటికి చేరుతారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News