కాటిపల్లి హామీలు ‘కాటి’కేనా ?!
దీంతో ఆ పార్టీ శ్రేణులను గ్రామాలలో ప్రజలు నిలదీస్తుండడంతో వారు మొకం చాటేస్తున్నారు.
‘‘నా నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉచిత కార్పోరేట్ విద్య, వైద్యం.ఉచిత శిక్షణ కేంద్రాలు నిర్మిస్తా. రైతులకు సొంతంగా పొలాలలో కల్లాలు నిర్మిస్తాం. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తా. ఆసుపత్రులతో పాటు పాఠశాలలు కూడా నిర్మిస్తా. ఆస్తులు అమ్మి అయినా రూ.150 కోట్లతో ఆరు నెలలలో అభివృద్ది చేస్తా’’ అని ప్రకటించడంతో జనం ఘనవిజయం అందించారు. ఎన్నికల్లో గెలిచి 9 నెలలు దాటినా ఆ ఎమ్మెల్యే ఇప్పుడు హామీల ఊసు ఎత్తడం లేదు. దీంతో ఆ పార్టీ శ్రేణులను గ్రామాలలో ప్రజలు నిలదీస్తుండడంతో వారు మొకం చాటేస్తున్నారు.
కామారెడ్డి శాసనసభ స్థానం నుండి మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో తలపడి మరీ గెలిచాడు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి. 6741 ఓట్లతో కేసీఆర్ ను ఓడించిన కాటిపల్లి అందరిదృష్టిని ఆకర్షించాడు. ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించిన జెయింట్ కిల్లర్ అని మీడియా కొద్ది రోజులు కాటిపల్లిని ఆకాశానికి ఎత్తింది. అయితే గెలిచి 9 నెలలు అయినా హామీల ఊసెత్తకపోవడంతో ప్రజలు ఆస్తులు అమ్మి అభివృద్ది చేస్తా అన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి పోయాడు అని నిలదీస్తున్నారు.
త్వరలో గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల్లో కాటిపల్లి ఇచ్చిన రూ.150 కోట్ల మేనిఫెస్టో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సొంత డబ్బులతో అభివృద్ది చేస్తా అన్న హామీ ఏమైంది అని రైతులు, యువత, విద్యార్థులు నిలదీస్తున్నారు. ఈ నిలదీతలు ఎక్కువైన నేపథ్యంలోనే శాసనసభ సమావేశాల సంధర్భంగా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను అంటూ కాటిపల్లి వైరాగ్యం ప్రదర్శించాడని అంటున్నారు.