కాటిపల్లి : దాల్ మే కుచ్ కాలా హై !
పార్టీ అంతా ఒకలా ఉంటే .. ఆయన మాత్రం మరోలా వ్యవహరిస్తున్నాడు.
ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిచిన తెలంగాణ బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో చాలా విచిత్రంగా, వినూత్నంగా ఉంటున్నాయి. పార్టీ అంతా ఒకలా ఉంటే .. ఆయన మాత్రం మరోలా వ్యవహరిస్తున్నాడు. అసలు ఆయన మనసులో ఏం ఉంది ? ఏం చెప్పాలనుకుంటున్నాడు ? అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం సభా సమావేశాలు సరిగ్గా జరగడం లేదని, ప్రజా సమస్యలు చర్చకు రాకపోవడం చాలా బాధగా ఉందని కాటిపల్లి అసెంబ్లీ మీడియా పాయింట్ లో వ్యాఖ్యానించాడు. రెండు రోజుల క్రితం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని వ్యతిరేకంగా సభ తీర్మానం చేస్తే దానిని బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ బహిష్కరించారు. కానీ కాటిపల్లి మాత్రం సభలోనే ఉండిపోవడం చర్చానీయాంశం అయింది.
కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బద్ద వ్యతిరేకి అని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ ఎడ్డెం అంటే బీజేపీ తెడ్డెం అని, బీజేీపీ ఎడ్డెం అంటే కాంగ్రెస్ తెడ్డెం అని అంటుంటాయి. ఈ నేపథ్యంలో కాటిపల్లి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారేమో. నేను మాత్రం మన తెలంగాణ ప్రభుత్వం అని అనుకుంటున్నాను. ఈ రోజు ప్రభుత్వం రుణమాఫీ చేసింది. ఏ పార్టీ మంచిచేసినా అంగీకరించాలి. దీనిని నేను స్వాగతిస్తున్నా. ఈ ప్రభుత్వంలో మనం సభ్యులం’’ అని గుర్తుంచుకోవాలని అన్నారు.
ప్రభుత్వం అందరిదీ. ప్రభుత్వ కార్యక్రమాలలో పార్టీలకు అతీతంగా పాల్గొనాలి. ప్రభుత్వ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు పెడితే మనం అభ్యంతరం తెలిపి పోకపోవచ్చు. కానీ మన సీఎం, మన ఆర్థికమంత్రి, మన వ్యవసాయ మంత్రి ఫోటోలు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వ కార్యక్రమంగా భావిస్తున్నట్లు కాటిపల్లి పేర్కొనడం అసలు ఆయన ఆలోచన ఏంటా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సభలో సభ్యులను చూస్తుంటే ఇంటర్ కాలేజీ పిల్లలను చూస్తున్నట్లుందని, కాలేజీ మాదిరిగానే సభ నడుస్తుంటే సభ్యులు ఎవరి ఇష్టం వచ్చినట్లు వచ్చిపోతుంటారని, 10 గంటలకు సభ మొదలయితే 12 గంటలకు టీ బ్రేక్ అంటారని, ఒక సభ్యుడు మాట్లాడితే 119 మంది సభ్యులు వినాలని, అప్పుడే అది అందరు సభ్యుల ద్వారా ప్రజలకు చేరుతుందని, కానీ సభ్యులలో సీరియస్ నెస్ లేదని కాటిపల్లి అన్నారు. మరి ఆయన కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారా ? చేరలేక వైరాగ్యం ప్రదర్శిస్తున్నారా ? అని శాసనసభ లాబీలలో సభ్యులు గొణుగుతున్నారు.