పొలిటికల్ చాంపియన్ అవ్వాలనే తాపత్రయమేనా? కౌశిక్ రెడ్డి ప్లానే వేరబ్బా!
నిత్యం ఏదో వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్న కౌశిక్ రెడ్డి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో ఘర్షణకు దిగి హాట్ టాపిక్ గా మారారు.
సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా కెరీర్ కొనసాగించలేకపోయిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పొలిటికల్ చాంపియన్ అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే ఇందుకోసం ఆయన ఎంచుకున్న మార్గమే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారుతోంది. నిత్యం ఏదో వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్న కౌశిక్ రెడ్డి తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో ఘర్షణకు దిగి హాట్ టాపిక్ గా మారారు.
2004 నుంచి 2007 వరకు రాష్ట్రస్థాయి క్రికెట్ ఆడిన కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2018లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2021లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డి అప్పటి నుంచి వివాదాస్పద వైఖరితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. దూకుడు రాజకీయం ఎంచుకున్న కౌశిక్ రెడ్డి తెలంగాణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అనవసర వివాదాల్లో తలదూర్చుతుంటారని సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.
హుజురాబాద్ లో సీనియర్ నేత ఈటల రాజేందర్ ను ఎదుర్కొవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ప్రోత్సహిస్తూ వచ్చింది. 2021లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేయాలని భావించింది. అయితే అప్పటి గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని నామినేట్ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో అదే ఏడాది ఎమ్మెల్యేల కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేశారు. అయితే గవర్నర్ తన కోటాలో నియమించలేదనే కోపంతో మహిళ అని కూడా చేయకుండా కౌశిక్ రెడ్డి అప్పటి గవర్నరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ కావడంతో క్షమాపణలు చెప్పారు. ఇలా తొలిసారి చట్టసభలో అడుగుపెట్టిన సందర్భంలోనే దూకుడు ప్రదర్శించిన కౌశిక్ రెడ్డి ఇప్పటికీ అదే వ్యూహం ప్రదర్శిస్తున్నారు. దీంతో నిత్యం ఏదో వివాదం తెచ్చుకోవడం ఆయన నైజంగా మారింది.
2023లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో తన విజయయాత్రో శవయాత్రో ఓటర్లే తేల్చాలని, ఎన్నికల్లో గెలవకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా ఆ ఎన్నికల్లో గెలిచారని ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఎన్నికల తర్వాత కూడా దూకుడుతో బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ గా నిలవాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల టార్గెట్ గా కౌశిక్ రెడ్డి చూపిస్తున్న జోరు చర్చనీయాంశమవుతోంది. పీఏసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించిన సందర్భంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఆ సమయంలో అరికెపూడి ఇంటిపై దాడికి ప్రయత్నించిన కౌశిక్ రెడ్డి పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించి కేసుల్లో ఇరుకున్నారు. ఇక తాజాగా పార్టీ మారారనే కోపంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో ఘర్షణకు దిగారు.
బీఆర్ఎస్ నుంచి సుమారు పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే, ఆ పార్టీ అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ఫిరాయింపుదారులపై న్యాయపోరాటానికే పరిమితమైంది. అధినేత కేసీఆర్, అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావు సైతం పార్టీ మారిన వారిపై తీవ్ర విమర్శలు చేయలేదు. కానీ, కౌశిక్ రెడ్డి మాత్రం తరచూ వీధి పోరాటాలకు దిగుతుండటం మాత్రం చర్చనీయాంశమవుతోంది. పార్టీ మారిన వారంతా ద్రోహులుగా చూస్తున్న కౌశిక్ రెడ్డి తాను పార్టీ మారిన విషయం మరచిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ లో మిగిలిన నేతలు అంతా సైలెంట్ గా ఉండగా కౌశిక్ రెడ్డి వైలెంట్ బిహేవియరుతో రచ్చ రచ్చ చేయడం వెనుక ప్రత్యేక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనను పోల్చుకుంటూ దూకుడుగా రాజకీయం చేస్తే త్వరగా ఎదగొచ్చని భావిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే తానే గులాబీ పార్టీ అధినేత అన్నట్లు భ్రమపడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న నాయకులు, అధికారుల పేర్లను బ్లాక్ బుక్కులో రాసుకుంటున్నట్లు గతంలో ప్రకటించారు. ఆయన రాస్తున్న బ్లాక్ పుస్తకానికి బీఆర్ఎస్ అగ్రనేతల ఆమోదం ఉందో? లేదో? కానీ తాను మాత్రం దూకుడు రాజకీయం చేస్తూ మంచి ప్రచారం చేసుకోగలుగుతున్నారని అంటున్నారు.