బీఆర్ఎస్ హయాంలో జరిగింది అదే కదా ‘కౌశిక్కూ’.. ఇప్పుడు ఈ గోల ఏంటి?

సాధారణంగా తీవ్రవాద కార్యకలాపాలను కనిపెట్టడానికి ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతుంటాయి.

Update: 2024-09-05 09:25 GMT

సాధారణంగా తీవ్రవాద కార్యకలాపాలను కనిపెట్టడానికి ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతుంటాయి. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను కనిపెట్టేందుకు ట్యాపింగ్ చేస్తుంటారు. కానీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శలు వచ్చాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పొలిటికల్ లీడర్ల ఫోన్లు, వ్యాపారవేత్తలవి, జర్నలిస్టులవి ట్యాపింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

ఆ వ్యవహారం కాస్త రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. నిందితులుగా ఉన్న పోలీసు అధికారులను విచారించారు. దానికి బాధ్యులను గుర్తించారు.

కట్‌చేస్తే.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది. తన ఫోన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మరోఅడుగు ముందుకేసి.. ప్రతీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.

మీడియా సమావేశంలో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంతోపాటు కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మానకొండూర్ సీఐకి కాన్ఫరెన్స్ పెట్టడం లేదని మంత్రి, ఎమ్మెల్యేకు ఎలా తెలుసని నిలదీశారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను ట్యాప్ చేయడం సిగ్గుచేటన్నారు. సీపీ ఫోన్ ట్యాపింగ్ అవుతుంటే కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News