కౌశిక్.. నీకు అంత సీన్ ఉందా..! సోషల్ మీడియా కోసం ఎక్కువ చేస్తున్నావ్..!

కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Update: 2024-09-17 06:51 GMT

కొంత కాలంగా తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసి మరోసారి చర్చ అయ్యాడు. ఇప్పటికే అరికెపూడి గాంధీతో వివాదం కొనసాగుతుండగానే.. సీఎంపై అలా మాట్లాడడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ట్రోల్స్ చేస్తున్నారు.

కౌశిక్ రెడ్డికి రాజకీయాల్లో పట్టుమని పదేళ్ల సీనియార్టీ కూడా లేదని తెలిసిన విషయమే. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు. ఆయన గత ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తరువాత 2021 జూలై 12 ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అదేనెల 21న బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2021 నవంబర్ 16న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యాడు. 22న ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

2023లో హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియామకం అయ్యాడు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. అయితే.. ఆయన గెలిచేందుకు కూడా ఓ ప్రధాన కారణం ఉందనేది ఆ సమయంలో అందరూ చర్చించుకున్నారు. ఫ్యామిలీ సెంటిమెంటుతోనే ఆయన గెలిచారని అందరూ అంటుంటారు. తనను ఎన్నికల్లో గెలిపించుకుంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ బ్లాక్ మెయిల్ చేసి గెలిచాడని ఇతర పార్టీల నేతలు ఇప్పటికీ కామెంట్స్ చేస్తుంటారు. ఓటర్లు కూడా ఆయన సెంటిమెంటుకు లొంగి గెలిపించారనేది టాక్. అయితే.. ఆయన గెలిచినప్పటి నుంచి ఇంతవరకు నియోజకవర్గం అభివృద్ధిపై మాట్లాడిన దాఖలాలు అయితే లేవు. ఎంతసేపూ ప్రభుత్వంపై విమర్శలు చేయడం తప్పితే.. నియోజకవర్గ ప్రజలను పట్టించుకున్నది కూడా లేదని అక్కడి ప్రజల నుంచి వస్తున్న మాటలే.

కట్‌ చేస్తే.. కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి వివాదాస్పదానికి కేరాఫ్‌గా మారిండని ఆ పార్టీకి చెందిన లీడర్లే గుసగుసలాడుతుంటారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నిక నుంచే వివాదం నెలకొంది. రాష్ట్ర గవర్నర్ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా.. దానిని తట్టుకోలేని కౌశిక్ రెడ్డి గవర్నర్ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీపై నిత్యం విమర్శలు చేస్తూ వస్తున్నాడు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచి ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. ఇటీవల పీఏసీ చైర్మన్‌గా నియామకం అయిన అరికెపూడి గాంధీ, కౌశిక్ మధ్య పసలేని వివాదం నెలకొంది. వారిద్దరి మధ్య అర్థంపర్దం లేని రగడ కొనసాగింది. మాటలతో మొదలైన వీరి రచ్చ.. చివరకు ఇరువర్గాలు ఘర్షణ చేసుకునే స్థాయి వరకూ వెళ్లాయి. ఈ ఎపిసోడ్ నాలుగైదు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కౌశిక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటి సారాంశం ఏంటంటే.. కౌశిక్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు పీసీసీ చీఫ్ కావడానికి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరకు వచ్చి బతిమిలిడంట. తన కాళ్లు కూడా మొక్కాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఈ మాటలు చర్చకు దారితీయగా.. కౌశిక్ పై విమర్శలూ వచ్చిపడుతున్నాయి. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్న సమయంలో ఆయనకున్న అనుభవం తక్కువ.. ఆయన ఒక్కసారిగా కూడా ఎమ్మెల్సీ గానీ, ఎమ్మెల్యే గానీ అయింది లేదు.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయన దగ్గరకు వచ్చి రెక్వెస్ట్ చేశాడంట.. అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు కౌశిక్‌కు కాంగ్రెస్ పార్టీలో ఉన్న హోదా ఏంటో తెలుసా అని పలువురు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఆయన రాజకీయ అనుభవంపైనా విమర్శలు చేస్తున్నారు. వయసు, అనుభవం తెలీకుండా మాట్లాడుతున్నాడని ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఫైర్ అయ్యారు. ‘కౌశిక్ రెడ్డి.. నువ్వు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాని నిన్ను రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం బతిమిలాడుకున్నాడా..? మాట్లాడేటప్పుడు వెనుకముందు ఆలోచించాల్సిన అక్కర్లేదా..?’ అంటూ నిలదీస్తున్నారు.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర సచివాలయం ముందు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కొత్త డిజైన్‌లో రూపకల్పన చేసి సచివాలయం ముందు ఏర్పాటు చేశారు. దాంతో ఈఅంశంపైనా కౌశిక్ రెడ్డి మాట్లాడుకొచ్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పుకొచ్చాడు. ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని అంటున్నాడు. వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అయిన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనడం న్యాయమే అయినప్పటికీ.. గత పదేళ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే ఉంది. కానీ.. మీ ప్రభుత్వం హయాంలో ఎందుకు గుర్తురాలేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతున్నారు.

ఫైనల్లీ.. కౌశిక్ రెడ్డి కేవలం ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. నిత్యం సోషల్ మీడియా, మీడియాలో కనిపించాలనే ఆయన ఆరాటమని, అందుకే ఇలాంటి అర్థంపర్దం లేకుండా మాట్లాడుతున్నాడని, ఆలోచన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. పనికిమాలిన ఇష్యూస్‌తో నిత్యం మీడియాలో హైలైట్ కావాలని చూస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News