'గాంధీ'.. ఆంధ్రానా..? హవ్వ కౌశిక్ రెడ్డి.. నీది నోరా? మోరీనా?
తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, రాజకీయ మైలేజీకి ప్రాంతాల వారీ చిచ్చును మళ్లీ రాజేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నోరు అదుపు తప్పారు.. అవి ఆయన మాటలో.. లేక బీఆర్ఎస్ పార్టీ మున్ముందు అనుసరించబోయే విధానమో..? ఏది అయితేనేం.. కౌశిక్ కట్టుతప్పారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయి.. హైదరాబాద్ కూడా తెలంగాణ పరం అయి.. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మర్చిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠకు, రాజకీయ మైలేజీకి ప్రాంతాల వారీ చిచ్చును మళ్లీ రాజేశారు. మరి దీనిపై బీఆర్ఎస్ ఏమంటుందో...? ఇంతకూ ఏం జరిగిందంటే..?
గాజులు పోయి.. బూజు పట్టినవాదంతో
బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన తెలంగాణ ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపుతానంటూ మీడియా ముందుకు వచ్చిన కౌశిక్ రెడ్డి.. ఈ సందర్భంగానే మరో సవాల్ చేశారు. కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్దకు వెళ్లి ఆందోళన చేస్తానంటూ ప్రకటన చేశారు. ఆయనను హౌస్ అరెస్టు చేయడంతో ఆగిపోయారు. అయితే, గాంధీ మాత్రం తన వర్గంతో కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డి ఇంటివద్దకు వచ్చి బైఠాయించారు. పోలీసులు పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ ను బయటకు పిలవాలని, లేదంటే తనను లోపలకు పంపాని కోరారు. కొందరు గాంధీ అనుచరులు కౌశిక్ ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌశిక్ నోరు అదుపుతప్పి మాట్లాడారు. గాంధీ ఆంధ్రా వ్యక్తి అని.. క్రిష్ణా జిల్లా నుంచి వచ్చారని.. మళ్లీ అక్కడకే పంపుతానని.. ఇది నీ అయ్య జాగీరా అని.. నోటికొచ్చినట్లు వ్యాఖ్యాలు చేశారు. ఇప్పుడివే చర్చనీయాంశం అవుతున్నాయి.
‘ఆంధ్రా’ మాట.. హవ్వ..
కౌశిక్ రెడ్డి రాజకీయ అడుగులు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో మొదలైన సంగతిని మర్చిపోయారేమో..? తెలంగాణ గడ్డపై ఉద్యమ వేడి ఎలా ఉందో చూపించిన మానుకోట (మహబూబాబాద్) ఘటనలో జగన్ వెనుక ఉన్నది కౌశిక్ రెడ్డి. అప్పుడు లేనిది ‘ఆంధ్రా’ ఇప్పుడు అరికెపూడి గాంధీ విషయంలో ఎలా వచ్చింది? ఆంధ్రాకే చెందిన టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురించి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆంధ్రా ఏమైంది.? అంతెందుకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇదే ‘ఆంధ్రా’ ఎమ్మెల్యేలను చేర్చకున్నప్పుడు ఏమైంది ఆంధ్రా? అసలు టీఆర్ఎస్సే బీఆర్ఎస్ గా మారినప్పుడు ఏమైంది ‘ఆంధ్రా?’ అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా, అరికెపూడి గాంధీ శేరిలింగంపల్లి నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఆయనను బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) లోకి తీసుకొచ్చారు కేసీఆర్. 2018, 2023లో టీ(బీ)ఆర్ఎస్ టికెట్ పైనే నెగ్గారు. ఇక కౌశిక్రెడ్డి వైసీపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయి ఆపై ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ లోకి వెళ్లి వివాదాస్పద రీతిలో ఎమ్మెల్సీగా నియమితులైన చావుతప్పి కన్నులొట్టబోయినట్లు గత ఏడాది ఎన్నికల్లో గెలిచారు.