కేసీఆర్, కవిత... ఆపండి మీ ఆంధ్ర గోల!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయం నుంచి.. ఆంధ్ర ప్రాంత ప్రజలపై బీఆరెస్స్ (టీఆరెస్స్) అధినేత కేసీఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేశారన్నది తెలిసిన విషయమే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాట సమయం నుంచి.. ఆంధ్ర ప్రాంత ప్రజలపై బీఆరెస్స్ (టీఆరెస్స్) అధినేత కేసీఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేశారన్నది తెలిసిన విషయమే. ఏపీ ప్రజలపై అప్పట్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో.. కేసీఆర్ పూర్వీకులది విజయనగరం అని.. ఏపీ ప్రజలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ వారి పూర్వీకులకు వర్తిస్తాయని పలువురు కామెంట్ చేసేవారు.
ఇలా ఏపీ ప్రజలపై తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దారుణమైన విమర్శలు చేశారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఏపీ ప్రజలను విమర్శించడాన్ని ఒక భాగంగా చేశారన్నా అతిశయోక్తి కాదేమో అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది! దీంతో... చాలా మంది నాయకులు ఇదే పంథాను అనుసరించారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అంటే ఏపీ ప్రజలను విమర్శించాలి అనేట్లుగా ఇంజెక్ట్ చేశారని అంటారు.
ఆ విధంగా కేసీఆర్ విమర్శలు ఉండేవి. అయితే... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. దశాబ్ధకాలం దాటేసింది. ఈ క్రమంలో కేసీఆర్ రెండుసార్లు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ సమయంలో ఇప్పటికీ ఆంధ్రులపై, ఆంధ్ర ప్రాంత నాయకులపై విమర్శలు మాత్రం ఆగడం లేదు! తాజాగా .. ఏపీ పాలకులపై బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు.
అవును... తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇంతకాలం అయినప్పటికీ.. ఏపీ ప్రాంత ప్రజలు, పాలకులపై విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా బీఆరెస్స్ పార్టీకి చెందిన నేతలకు ఈ తరహా వ్యాఖ్యలు ఊతపదాలుగా మారాయా అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా... మహాశివరాత్రి సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కవిత దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా... తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాల్ని ఆకాంక్షించారు. వేములవాడ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బీఆరెస్స్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధిని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు.. ప్రభుత్వాలు మారినా అభివృద్ధి కొనసాగాలని సూచించారు.
అంతవరకూ సరే కానీ... ఈ విషయంలోకూడా ఆంధ్ర పాలకులపై కవిత విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇందులో భాగంగా... ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు దేవుళ్లను కూడా అప్రతిష్టపాలు చేశారని.. ఆమె వ్యాఖ్యానించారు. అయితే... కేసీఆర్ మాత్రం ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేసి, రాజన్న సిరిసిల్ల జిల్లాగా నామకరణం చేశారని తెలిపారు.
దీంతో... ఈ వ్యాఖ్యలపై నెట్టింట విమర్శలు మొదలయ్యాయి. రాష్ట్రం ఏర్పడి ఇంతకాలం అవుతున్నా.. రెండు దఫాలు బీఆరెస్స్ అధికారంలో ఉన్నా.. ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన నేతలు ఏపీ పాలకులపై ఎందుకు విమర్శలు చేస్తున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు. ఓ పక్క అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటూనే మరోపక్క ఈ మాటలేలా అని అడుగుతున్నారు.