అదానీ ఇష్యూలో కవిత ఎంట్రీ... ప్రధానిపై కీలక వ్యాఖ్యలు!
ఈ సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ఆరోపించింది.
భారత్ లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతం అదానీ, మరో ఏడుగురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్.బీ.ఐ. చెబుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ఆరోపించింది.
ఇప్పుడు ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన రాహుల్ గాంధీ... "అదానీ అరెస్టు కాడు.. ఆయనపై విచారణ జరగదు.. అందుకు నేను గ్యారెంటీ ఇస్తాను.. అందుకు కారణం ప్రధాని మోడీ.. ఆయనను మోడీ కాపాడుతున్నారు" అంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కవిత ఎంట్రీ ఇచ్చారు.
అవును.. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారని.. వారిపై బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా అంటూ ప్రశ్నించారు.
"అఖండ భారతంలో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా??" అంటూ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇదే సమయంలో... "వారు అఖండ భారత్ ను ప్రచారం చేస్తారు కానీ.. సెలక్టివ్ జస్టిస్ ను అందిస్తారు! రాజకీయ ప్రత్యర్థులను సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేసి నెలల తరబడి విచారణలో ఉంచారు.. అదే సమయంలో గౌతం అదానీ పదే పదే తీవ్ర ఆరోపణలు వచ్చినప్పటికీ స్వేచ్ఛగా నడుచుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఆపేది ఏమిటి?" అని మరో ట్వీట్ చేశారు కవిత!
దీంతో.. అదానీపై అమెరికాలో కేసు వ్యవహరం పేరు చెప్పి బీజేపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి వీటిపై బీజేపీ వ్యూహం ఏమిటి..? రియాక్ట్ అవుతుందా..? లేక, మౌనంగా ఉంటే ఇష్యూ కాలగర్భంలో కలిసిపోతుందని ఆలోచిస్తుందా..? అనేది వేచి చూడాలి!