తిహాడ్ జైలులో కీలక మహిళా నేత 'సెంచరీ'.. మరికొన్ని రోజులూ?
మరోవైపు కవిత తిహాడ్ జైలులో ఉన్నారు. ఆమె అరెస్టయి సోమవారంతో 100 రోజులు పూర్తవుతోంది.
అంతా బాగుండి ఉంటే.. ప్రస్తుతం ఆమె ఎంపీగా ఉండేవారేమో? రాష్ట్రంలో పార్టీ మూడోసారీ గెలిచి ఉంటే మంత్రి పదవీ దక్కేదేమో? కానీ, ఇప్పుడు మాత్రం జైల్లో ఉన్నారు. ఏకంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు. మరికొన్ని రోజులూ అక్కడ ఉండక తప్పని పరిస్థితి. మద్యం కుంభకోణంలో చిక్కుకుని కష్టాలు అనుభవిస్తున్నారు.
ఊహించని పరిస్థితి తెలంగాణ ఉద్యమకారిణిగా, రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అధినేత కుమార్తెగా, ఎంపీగా పనిచేసిన వ్యక్తిగా, ఎమ్మెల్సీగా ఉన్న నాయకురాలిగా కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎవరూ ఊహించని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కనీసం ఆమె కలలో కూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటానని అనుకుని ఉండరు. మరోవైపు కవిత తిహాడ్ జైలులో ఉన్నారు. ఆమె అరెస్టయి సోమవారంతో 100 రోజులు పూర్తవుతోంది.
బెయిల్ ఎప్పుడో..?
ఢిల్లీ మద్యం కేసులో తిహాడ్ జైలులో ఉన్న కవితకు బెయిల్ లభించేది ఎప్పుడో తెలియడం లేదు. ఆమె తరఫు న్యాయవాదులు పదేపదే అభ్యర్థిస్తున్నా బెయిల్ లభించడం లేదు. మరోవైపు కవితను ఇటీవల ఆమె సోదరుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కలిసి ధైర్యం చెప్పారు. మహిళా మాజీ మంత్రులు కూడా కవితను ఓదార్చారు.
కొద్ది రోజుల కిందట ఇదే స్కాంలో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు రౌజ్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కవితకూ బెయిల్ వస్తుందని భావించారు. కానీ, ఇంతలో హైకోర్టు కేజ్రీ బెయిల్ పిటిషన్ పై స్టే విధించింది. కాగా, కవిత ఈ నెలాఖరు వరకు తిహాడ్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి.