కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు... ఈడీ సంచలన ఆరోపణలు!
ఈ సమయంలో ఆమె బెయిల్ పిటిషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే కొన్ని రోజుల ముందు బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ సమయంలో ఆమె బెయిల్ పిటిషన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అవును... ఢిల్లీ మద్యం కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైలో ఉన్న బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఆ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు మద్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు!
ఈ నేపథ్యంలో ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పై కవిత తరుపు లాయర్లు రిజాయిండర్ దాఖలు చేశారు. కవిత తరుపున మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈడీ తరుపు న్యాయవాదులు సంచలన వాదనలు వినిపించారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... కవితకు బెయిల్ ఇస్తే ఆమె ఆధారాలను, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని.. కవితకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని.. అసలు ఢిల్లీ మద్యం కుంభకోణానికి కవితే ప్రణాళిక రచించారని.. ఆమె తన ఫోన్ డేటానూ డిలీట్ చేశారని.. అధికారులకు 10 ఫోన్లు ఇచ్చినా, వాటన్నింటినీ ఫార్మెట్ చేసి ఇచ్చారని ఈడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ఇదే సమయంలో... అప్రూవర్ గా మారిన వ్యక్తిని కవిత బెదిరించారని.. ఇందులో భాగంగా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని అన్నారని తెలిపారు. ఇదే సమయంలో కవిత చిన్న కుమారుడు ఏమీ ఒంటరి కాదని.. అతనికి సోదరుడితో పాటు కుటుంబ సభ్యులూ తోడుగా ఉన్నారని.. ఆమె పరీక్షల కోసం బెయిల్ అడిగగా.. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయ్యాయని ఈడీ తెలిపింది.
ఇలా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఇదే సమయంలో ఈ నెల 20న రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లోనూ వాదనలు వింటామని తెలిపారు!!