ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. రౌండప్

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తల ఆందోళనల మధ్య కవిత అరెస్టుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు

Update: 2024-03-15 15:01 GMT

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సంచలనం కలిగిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పాత్రపై కొద్ది రోజులుగా వస్తున్న వదంతుల నేపథ్యంలో ప్రస్తుతం ఆమె అరెస్టు బీఆర్ఎస్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. మధ్యాహ్నమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కవితకు నోటీసు అందజేశారు. అనంతరం సోదాలు జరిపారు. సాయంత్రం ఆమెను అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు అరెస్ట్ చేస్తారనే ఊహాగానాల మధ్య బీఆర్ఎస్ నేతలు ఆమె నివాసానికి చేరుకున్నారు.

మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తల ఆందోళనల మధ్య కవిత అరెస్టుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వారు ఢిల్లీ నుంచి వచ్చే సమయంలోనే కవితకు ఫ్లయిట్ టికెట్ రిజర్వ్ చేసుకుని పథకం ప్రకారమే వచ్చారని తెలుస్తోంది. దీంతో కవిత అరెస్ట్ అలజడి కలిగిస్తోంది. బీఆర్ఎస్ నేతల ఆందోళనల మధ్య ఈడీ అధికారులు పోలీసుల సాయం తీసుకున్నారు.

ఆమెను నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి తమ వాహనంలో తరలించారు. అక్కడ నుంచి విమానంలో నేరుగా ఢిల్లీ తరలిస్తారని చెబుతున్నారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. కేసు సుప్రీంకోర్టులో ఉండగానే అరెస్ట్ కు పూనుకోవడం వల్ల ఈడీ అధికారులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ కేసులో ఢిల్లీకి చెందిన చాలా మంది అప్రూవర్ గా మారారు. దీంతో కవితను అరెస్టు చేసేందుకు ఈడీ సుముఖం చూపినట్లు చెబుతున్నారు. రాత్రి 8.45 గంటలకు ఢిల్లీకి నేరుగా విమానంలో తీసుకెళ్తారని తెలుస్తోంది. రేపు సుప్రీంకోర్టులో ఇదే కేసు మీద వాదనలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ తో ఏం చేయబోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.

మద్యం కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో వారందరిని అదుపులోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కేసుతో సంబంధం ఉన్న వారికి ఇది వరకే నోటీసులు ఇచ్చినా ఎవరు స్పందించలేదని సమాచారం. దీంతోనే ఈడీ అధికారులు అరెస్ట్ కు చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసిన సందర్భంగా అరెస్ట్ చేయడం సంచలనం కలిగిస్తోంది. రేపు జరిగే విచారణంలో ఏం తేలుతుందోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

ఇవాళ జరిగిన విచారణలో దాదాపు రెండు గంటల పాటు ఆమెను ఈడీ ప్రశ్నించింది. ఇందులో ఆమె వెల్లడించిన సమాధానాల పరంపరలోనే ఆమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. రేపు జరిగే విచారణలో ఏం తేలుతుందో అనే కోణంలో పలు ప్రశ్నలు వస్తున్నాయి. సుప్రీంకోర్టులో రేపటి నుంచి ఈ నెల 19 వరకు విచారణ కొనసాగుతుందని అంటున్నారు. దీంతో ఆమె అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

అరెస్ట్ సమయంలో కవిత కార్యకర్తలకు అభివాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు సంయమనం పాటించాల్సిందిగా కోరింది. అరెస్ట్ సమయంలో ఆందోళనలు వద్దని వారించింది. చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని సూచించింది. అరెస్ట్ ను న్యాయపరంగా ఎదుర్కొంటామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని అక్రమంగా అరెస్ట్ చేశారని నినదించారు.

Tags:    

Similar News