ఎమ్మెల్సీ కవిత అరెస్ట్!
మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి
మాజీ సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. ఎన్నికల వేళ ఆమెను అరెస్టు చేస్తారనే వదంతులు వచ్చినా తరువాత క్రమంలో వారు కుమ్మక్కయ్యారనే పుకార్లు వ్యాపించాయి. దీంతోనే కవిత అరెస్ట్ వాయిదా పడినట్లు అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతోనే ఎన్నికల్లో లబ్ధిపొంది ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోమారు కవిత అరెస్టు అవుతుందనే వదంతులు వ్యాపించడంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు కవిత నివాసానికి చేరుకున్నారు. కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడారు. ఈడీ, కేంద్రానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేస్తున్నారు.
కవితను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారులు అరెస్ట్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు నివాసంలో సోదాలు జరిపారు. మద్యం కేసులో ఆమె ప్రమేయం ఉందనే కేసు నడుస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఈడీ చర్యలను వ్యతిరేకిస్తున్నారు.
చట్ట ప్రకారమే ఆమెను ప్రశ్నించామని ఈడీ చెబుతున్నా వినిపించుకోవడం లేదు. అయితే ఆమె అరెస్ట్ అక్రమమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత నివాసం పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీ మధ్యం కేసులో ఆమె పాత్రపై గత కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కవితపై అరెస్టు అస్త్రం ప్రయోగించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ పెట్టిన కేసు విషయంలో కవిత సుప్రీం కోర్టులో కేసు వేసింది. అది విచారణలో ఉండగానే కవితను అరెస్టు చేయడం సంచలనం కలిగిస్తోంది. దీంతో కేసులో ఏం జరుగుతుందోననే ఆందోళన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది.