కవిత విచిత్రమైన రాజకీయం ?

ఆమె మీడియాతో మాట్లాడుతు అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతీరావు పూలె విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.;

Update: 2024-02-06 04:31 GMT

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేసీయార్ కుటుంబంతో పాటు బీఆర్ఎస్ నేతలు ఇంకా తట్టుకోలేకపోతున్నట్లున్నారు. కేటీయార్, హరీష్ రావు అయితే తామింకా అధికారంలో ఉన్నట్లు ఫీలవుతున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే కేసీయార్ కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారమే చాలా విచిత్రంగా ఉంది. ఆమె మీడియాతో మాట్లాడుతు అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతీరావు పూలె విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. పూలే విగ్రహం ఏర్పాటుకోసం 6వ తేదీనుండి రాష్ట్రవ్యాప్తంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేయబోతున్నట్లు పిలుపిచ్చారు.

నిజంగా ఇది బ్లాక్ మెయిల్ రాజకీయాలన్నట్లుగానే కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు. ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఎందుకు ఏర్పాటుచేయలేదో ముందు చెప్పాలి. తాము అధికారంలో ఉన్నపుడు పూలెని పట్టించుకోని బీఆర్ఎస్ కవితకు సడెన్ గా ఇపుడు పూలే గుర్తుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండునెలలైంది. ఇంతలోనే పూలే విగ్రహం ఏర్పాటుకు డిమాండ్లు, ఆందోళనలకు కవిత పిలుపివ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

పూలె విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ మదుసూధనాచారి కూడా డిమాండ్ చేసేశారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పూలె విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఎందుకు అనిపించలేదో అర్ధంకావటంలేదు. అలాగే 33 శాతం మహిళా రిజర్వేషన్ను అమలుచేయాలని కూడా కవిత డిమాండ్ చేస్తున్నారు. తన తండ్రి కేసీయార్ అధికారంలో ఉన్నపుడు ఎప్పుడూ కవితకు 33 శాతం మహిళా రిజర్వేషన్లు గుర్తుకురాలేదు.

అలాగే బీసీలకు బడ్జెట్లో రు. 20 వేల కోట్లు కేటాయించాలని మరో డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం పది బడ్జెట్లు ప్రవేశపెట్టినపుడు బీసీలకు రు. 20 కోట్లు కేటాయించాలని కవితకు అనిపించలేదు. బీసీల సంక్షేమానికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేయలేదు. ఇపుడిలాంటి డిమాండ్లు ఎందుకు చేస్తున్నారంటే కాంగ్రెస్ గెలుపును సహించలేకపోతున్నారు. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై వీలైనంత బురదచల్లేయాలన్న ఆలోచనే కనబడుతోంది వీళ్ళ డిమాండ్లు, మాటల్లో. మిగిలిన నేతలను పక్కనపెట్టినా కల్వకుంట్ల కుటుంబం మాటల్లో మాత్రం ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతోంది.

 

Tags:    

Similar News