వంద కోట్ల ముడుపులు వెనక కవిత...!

కవిత వంద కోట్ల ముడుపుల విషయంలో ప్రమేయం కలిగి ఉన్నారని ఆధారాలు లభించడంతోనే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.

Update: 2024-03-18 15:57 GMT

తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత వంద కోట్ల ముడుపుల విషయంలో పూర్తిగా ప్రమేయం కలిగి ఉన్నారంటూ ఎంఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరిస్తూ ఈడీ చేసిన అధికారిక ప్రకటనలో పలు విషయాలు ఉన్నాయి. కవిత వంద కోట్ల ముడుపుల విషయంలో ప్రమేయం కలిగి ఉన్నారని ఆధారాలు లభించడంతోనే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు వెల్లడించారు.

అంతే కాదు లిక్కర్ స్కాం లో కవిత ఈ వంద కోట్ల ముడుపులను ఆప్ నేతలకు చేర్చారని ఈడీ పేర్కొంది. అందుకే కోర్టు అనుమతితో ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు అంటున్నారు. ఇక ఈ వంద కోట్లు ఎలా వెళ్లాయన్న దాని మీద కూడా ఈడీ వివరణ ఇచ్చింది.

తాము ఈ కేసు విషయంలో ఏకంగా 240 చోట్ల సోదాలు నిర్వహించామని, అలాగే 128 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ వంటి వారితో కవితకు సంబంధం ఉందని ఈడీ స్పష్టం చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయం గత కొన్ని నెలలుగా ఢిల్లీని అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఇపుడు కవిత అరెస్ట్ తో కీలక ఘట్టానికి ఈ కేసు చేరుకుందని అంటున్నారు. కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అయితే ఈడీ విచారణలో కవిత నోరు విప్పడంలేదు అనే ప్రచారం సాగుతోంది.

అయితే కీలక ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని వాటి విషయంలోనే విచారణ చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద కవిత గత శుక్రవారం అరెస్ట్ అయ్యారు. ఇప్పటికి నాలుగు రోజులు గడచింది. ఈ కేసు విషయంలో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నా ఈడీ మాత్రం తన పని తాను చేసుకుని పోతోంది. రానున్న రోజులలో మరిన్ని సంచలనాలు నమోదు అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News