కేసీఆర్ రాకపై క్లారిటీ వచ్చేసింది.. కేటీఆర్ కీలక ట్వీట్

రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు కేసీఆర్.

Update: 2024-11-01 11:30 GMT

కేసీఆర్ ప్రజల్లోకి రాకపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రేపు వస్తాడు.. ఎల్లుండి వస్తాడు.. అంటూ లీకులు ఇస్తున్నారే తప్పితే కేసీఆర్ నుంచి మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. దాంతో పది నెలలుగా కేసీఆర్ కోసం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆయన రాకకోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. పదేళ్ల పాటు ఆయనే సీఎంగా ఉండిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికలు మాత్రం ఝలక్ ఇచ్చాయి. దాంతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాలేదు. పది నెలలుగా ఆయన ఫామ్‌హౌజ్‌లోనే జీవితాన్నే గడుపుతున్నారు. దాంతో అసలు కేసీఆర్‌కు ఏమైంది అని అందరిలోనూ ఉత్కంఠ కనిపించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి పది నెలలు గడిచింది. ఇప్పటివరకు ప్రభుత్వం చేస్తున్న పనులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు మాత్రమే విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నారు. నిత్యం ట్విట్టర్‌లోనూ ఏదో ఒక పోస్టింగ్ పెడుతూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ.. కేసీఆర్ లాంటి మాస్ ఫీలింగ్ ప్రజల్లో తీసుకురావడంలో ఫెయిల్ అవుతున్నారన్న అపవాదు ఉంది. కేసీఆర్ వస్తేనే పూర్వవైభవం చూస్తామనే ఫీలింగ్ పార్టీ కేడర్‌లో కనిపిస్తోంది.

అయితే.. పది నెలలుగా ఫామ్‌హౌజ్‌లోనే ఉండిపోయిన కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారనే విషయమై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అనారోగ్య కారణాల వల్ల ఇన్ని రోజులు కేసీఆర్ రెస్టులో ఉన్నారని, వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. డిసెంబర్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం పూర్తవుతుంది. దాంతో ఆ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ చేసిన పనులు.. చేసిన అప్పులు.. చేపట్టిన ప్రయోజనాలపై స్టడీ చేసి నిలదీసేందుకు వస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారని, ప్రతిరోజు తమకు మార్గనిర్దేశం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడానికి కేసీఆర్ కొద్ది రోజులు సమయం ఇచ్చారని, 2025 నుంచి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని, అన్నీ కుదిరితే 2025కంటే ముందే వస్తారని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ప్రకటనతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. అధినేత రాక కోసం ఎదురుచూపులకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడుతుండడంతో అందరిలోనూ ఆనందం కనిపిస్తోంది.

Tags:    

Similar News