చెల్లని రూపాయి’ మాట నోటి నుంచి రాకుండా చేశారే?

ఎవరైనా ఎన్నికల్లో ఓడినంతనే.. చెల్లని రూపాయి.. చెల్లని రూపాయి అంటూ హేళన చేసే తత్త్వం కేసీఆర్.. కేటీఆర్ లలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

Update: 2023-12-04 23:30 GMT

ఇప్పటి కాలంలో వినేందుకు కాస్తంత మొరటుగా ఉంటుంది కానీ.. పాతకాలం నాటి సామెత ఒకటి తాజా రాజకీయ పరిస్థితుల్లో గుర్తు చేసుకున్నప్పుడు నిజమే కదా? అనిపించక మానదు. కాలు జరితే వెనక్కి తీసుకోవచ్చు.. మాట జారితే వెనక్కి తీసుకోలేమని. అందునా రాజకీయాల్లో ఉన్నప్పుడు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు మరింత ఒద్దికగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్నా లేకున్నా పెద్ద మాటల్ని మాట్లాడేయటం అప్పటికి బాగున్నా.. కాలపరీక్షలో అవన్నీ పాముల మాదిరి వెంటాడి కాటేస్తాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఎవరైనా ఎన్నికల్లో ఓడినంతనే.. చెల్లని రూపాయి.. చెల్లని రూపాయి అంటూ హేళన చేసే తత్త్వం కేసీఆర్.. కేటీఆర్ లలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. గెలుపు ఓటములు అందరికి ఒకేలా ఉండవు. కొందరు ఎంత కష్టపడినా ఫలితం సానుకూలంగా ఉండదు. కొందరు.. గాలి వాటున కూడా గెలిచిపోతారు.అయితే.. ప్రతికూల పరిస్థితుల్లోనూ గెలిస్తే అది గొప్పతనం.

అయితే.. ఈ విషయాన్నిపట్టించుకోని గులాబీ తండ్రీకొడుకులు.. ఎన్నికల్లో ఓడిన ప్రముఖులను అవహేళన చేసేలా మాట్లాడటం ఎన్నో సందర్భాల్లో చూసిందే. అయితే.. ఇక్కడ మర్చిపోయే విషయం ఏమంటే.. తాము అధికారంలోకి రావటానికి ముందు.. విపక్షంలో ఉండటం.. అప్పట్లో ఎన్నో ఈతి బాధల్ని అనుభవించిన వైనాన్ని మరచిపోవటం కనిపిస్తుంది. ఎన్నికల్లో ఓడిన వారిని ఉద్దేశించి చెల్లని రూపాయివి.. ప్రజలు తిరస్కరించినోడివి.. నువ్వా.. మాట్లాడేది అంటూ విరుచుకుపడటం తెలిసిందే.

తాజాగా వెల్లడైన ఫలితాల్లో కామారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ (ఇప్పుడు అపద్ధర్మ సీఎం అనుకోండి) ఓడిపోవటానికి మించిన అవమానం ఇంకొకటి ఉండదు. సీఎంలను ఓడించే విషయంలో తెలుగు ప్రజల టాలెంట్ ఎమిటన్నది చరిత్రను చూస్తే అర్తమవుతుంది. అలాంటప్పుడు కాస్తంత ఒళ్లు దగ్గర పెట్టుకొనిపని చేయాల్సి ఉంటుంది. కానీ.. గెలుపు మీద ధీమాతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. ఈ రోజున స్వయంగా కేసీఆరే ఓడిన వేళ.. రానున్న రోజుల్లో ఎవరు ఓడినా సరే.. చెల్లని రూపాయి అన్న మాటను వాడేందుకు అవకాశం లేకుండా తెలంగాణ ప్రజలు చేశారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు