షేమ్ టూ షేమ్.. జార్ఖండ్ లో ఆయన.. తెలంగాణలో ఈయన

ఉద్ధండులైన రాజకీయ నాయకులు పీవీ నరసింహారావు, వాజ్ పేయీల కాలంలో జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించారు శిబూ సోరెన్.

Update: 2024-03-21 09:51 GMT

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒక్కోసారి అందలం ఎక్కిస్తుంది.. మరోసారి కాలనాగై కాటేస్తుంది.. మనదైన రోజున మహారాజును చేస్తుంది.. తనదైన రోజున కిందకు పడేస్తుంది.. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే..

అక్కడ అలా..

ఉద్ధండులైన రాజకీయ నాయకులు పీవీ నరసింహారావు, వాజ్ పేయీల కాలంలో జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించారు శిబూ సోరెన్. జల్ (నీళ్లు) జంగిల్ (అడవి- గిరిజనులు), జమీన్ (భూమి) నినాదంతో జార్ఖండ్ కోసం ఉద్యమించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అంటూ పార్టీని స్థాపించారు. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పాటయింది. 2004 నుంచి శిబూ సోరెన్ రెండుసార్లు, స్వతంత్ర అభ్యర్థి మధుకోడా రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాలుగు సంవత్సరాలలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి మారారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 2019 ఎన్నికల అనంతరం జేఎంఎం వ్యవస్థాపకుడు శిబూ సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల హేమంత్ అవినీతి ఆరోపణలతో జైలుపాలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సోరెన్ భార్య కు పదవి ఇస్తారని భావించారు. కానీ కుటుంబంలో విభేదాలు రావడంతో చివరకు చంపయి సోరెన్ ను సీఎం చేశారు. కాగా, శిబూ సోరెన్ కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు గతలోంనే చనిపోయారు. ఈయన భార్య సీతా ఎమ్మెల్యే. తాజాగా బీజేపీలో చేరడం గమనార్హం. ఇక శిబూ సోరెన్ పై డబ్బు తీసుకుని పార్లమెంటులో ఓటు వేశారన్న ఆరోపణలు వచ్చాయి. సీతా కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన శిబూ సోరెన్ కుటుంబం చుట్టూ అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. జమీన్ (భూ కుంభకోణం)లోనే హేమంత్ అరెస్టవడం గమనార్హం.

తెలంగాణలో ఈయన

ఉమ్మడి రాష్ట్రంలో మహా మహా నాయకులను ఎదుర్కొని 14 ఏళ్లు ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం అంటూ తెలంగాణ కావాలంటూ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అంటూ పార్టీని స్థాపించారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉన్నారు. ఆపై ఇటీవలి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తన హయాంలో కుటుంబానికి పెద్ద పీట వేశారన్న అపవాదు మూటగట్టుకున్నారు. వాస్తవానికి కేసీఆర్ కుటుంబం అంతా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఓ విధంగా వారు పదవులకు అర్హులే. కాగా, కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోర తప్పిదానికి పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్యోగ నియామకాల్లోనూ విఫలమైందనే విమర్శలున్నాయి. చివరకు ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.

Tags:    

Similar News