కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు: కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. రేవంత్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. రేవంత్ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదని విమర్శించారు. అంతేకాదు.. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పోయి.. బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేద న్నారు. ఈ మేరకు మెదక్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్ విమర్శలతో విరుచుకుపడ్డారు. రైతులకు ఇవ్వాల్సిన బోనస్ నిధులను ఇవ్వాలని సూచించారు. ఇదేసమయంలో బీఆర్ ఎస్ నాయకులను వేధిస్తున్న పోలీసుల వివరాలను నమోదు చేసుకుంటున్నామని.. తాము తిరిగి అధికారంలోకివచ్చాక.. వారి పనిపడతామని హెచ్చరించారు.
సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా అధికారంలో ఉండేలా కనిపించడం లేదన్నారు. రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరినా ఆశ్చర్యం లేదన్న కేసీఆర్.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రేవంత్‌కు అందుతున్న రిపోర్టులు ఆయనలో వణుకు పుట్టిస్తున్నాయని చెప్పారు. అందుకే నారాయణ పేట సభలో తీవ్రంగా ఊగిపోయా రన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 సీట్లు కన్నా ఎక్కువ రావని కేసీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ ఎస్ అభ్యర్తులు 10 నుంచి 12 స్థానాల్లో విజయం దక్కించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
పోలీసులకు వార్నింగ్..
మెదక్ సభలో కేసీఆర్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అమాయకులను బెదిరించడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను పీకేయడంపై ఆలోచన చేసుకోవాలని సూచించారు. పోలీసులు బీఆర్ ఎస్ నేతల విషయంలో చేస్తున్న అరాచకాలను బంద్ చేయాలన్నారు. అలా కాదని.. ఇదే పంథా కొనసాగిస్తే.. బీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మీ గతి ఏమవుతుందో చూసుకోవాలని హెచ్చరించారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు దల్వాజీ మాధవరావు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడని అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించారని కేసీఆర్ అన్నారు. డీజీపీ మాధవరావు అంశంలో విచారణ జరిపించాలని కోరారు. అంతేకాదు... అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎస్సై, సీఐలపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే.. తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.
రైతులకు సంబంధించి..
తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు ఇస్తామన్న బోనస్‌ను ఇవ్వాలనిప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు. ఈ విషయంలో తాము అడ్డుపడబోమన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ఇది అమలు చేయాలని.. దీనిపై తాము ఎవరికీ ఫిర్యాదు చేయబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పి ఇప్పుడు దానిని అమలు చేయడం లేదని, వాయిదా వేసిందని విమర్శించారు. మహిళలకు రూ.2500తో పాటు ఏ హామీని నెరవేరలేదన్నారు.