కేసీఆర్ కంట తడి.. అస్వస్థత!
తన ముద్దుల కూతురు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలుసుకున్న బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ కంటతడి పెట్టారు
తన ముద్దుల కూతురు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలుసుకున్న బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ కంటతడి పెట్టారు. తొలిసారి ఆయన బోరున విలపించారు. తన ఇంట్లోనే ఉన్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అడపా దడపా మాత్రమే బయటకు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కసరత్తు ముమ్మరం చేస్తూనే.. మరోవైపు.. పార్టీని వీడి పోతున్న వారితోనూ మంతనాలు చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా కవితను ఈడీ అధికా రులు అరెస్టు చేయడంతో ఆయన ఒక్కసారిగా మ్రాన్పడిపోయారు.
మరోవైపు బీజేపీ నాయకులు కవ్వింపు వ్యాఖ్యలు చేస్తుండడంతో కేసీఆర్‌కు నోరు పెగలడం లేదు. తప్పు చేయకుండానే కవిత ను ఈడీ అధికారులు అరెస్టు చేశారా? అంటూ.. తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. అనేక సార్లు ఈడీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చార ని.. అయినా ఆమె స్పందించలేదని అందుకే ఈడీ అధికారులు అరెస్టు చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, బీజేపీకి, ఈడీ అధికారులు అరెస్టు చేసిన దానికి సంబంధం లేదన్నారు.
మరోవైపు.. కవిత ఇంట్లో ఏం జరుగుతోందో చూసేందుకు వెళ్లిన ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, ఆయన బావమరిది, మరో మాజీ మంత్రి హరీష్‌రావులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు గేటు ముందే ఉండిపోయారు. కవితను అరెస్టు చేసి తీసుకు వెళ్తున్నప్పుడు.. ఆమె భర్తకు మాత్రమే విషయాన్ని చెప్పారు. నోటీసులను కూడా ఆయనకే ఇచ్చారు. దీంతో కేసీఆర్ తన ఇంట్లో ఒంటరిగానే ఉండిపోయారు. కేసీఆర్ తన బాధను ఎవరికీ చెప్పుకోలేక.. మౌనంగానే రోదించిన ఘటన బీఆర్ ఎస్ వర్గాల్లో ఆవేదనను నింపింది. గత ఎన్నికల సమయంలోనూ బీజేపీని పన్నెత్తు మాట అనకుండా ఉండడానికి కవితే కారణమని చర్చ జరిగింది.
ఇక, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ దేశవ్యాప్తంగా విజృంభించాలని, ప్రధాని మోడీని గద్దెదింపాలని అనుకున్నా.. కవిత కారణంగానే ఈ ప్రయత్నాలను కేసీఆర్ వాయిదా వేసుకున్నారు. తన పార్టీకి బీఆర్ ఎస్ పేరు పెట్టడం వెనుక కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే ఉద్దేశం ఉంది. అయినప్పటికీ.. తన దూకుడు కారణంగా కవితను ఇబ్బందుల్లోకి నెటట్టడం ఇష్టం లేక ఆయన మౌనం వహించారు. ఇంత చేసినా.. ఈడీ తన కుమార్తెను అరెస్టు చేయడంతో కేసీఆర్ కంటతడి పెట్టినట్టు.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి.