కేసీఆర్ కి అస్త్రం దొరకడం లేదా...!?
ఆయన పార్టీ ఎపుడైతే గత డిసెంబర్ లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఓడిందో నాటి నుంచి కేసీఆర్ లో హుషార్ కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది
రాజకీయ ఉద్దండుడు తిమ్మిని బమ్మిని చేసే చాతుర్యం కలిగిన నేతగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఇపుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గతంలో ఉన్న జోరు జోష్ తగ్గాయా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. మాటల మాంత్రికుడు. తన సమ్మోహన శక్తితో సభలలో లక్షలాది జనాలను ఆకట్టుకుని వారిని బీఆర్ఎస్ వైపుగా నడిపించే దిట్టగా కేసీఆర్ ని నిన్నటి దాకా అంతా చూసారు.
ఆయన పార్టీ ఎపుడైతే గత డిసెంబర్ లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో ఓడిందో నాటి నుంచి కేసీఆర్ లో హుషార్ కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. ముంగిట్లోకి ఎంపీ ఎన్నికలు వచ్చేశాయి. అన్ని పార్టీలు అభ్యర్ధులను ప్రకటిస్తూ ప్రచార పర్వంలోకి దూకుతున్నాయి. కానీ బీఆర్ఎస్ లో మాత్రం ఎన్నికల వేడి తగలడం లేదా అని అంతా అనుకుంటున్నారు.
ఇక కేసీఆర్ స్టైల్ కూడా అందరికీ తెలుసు. ఆయన టీఆర్ఎస్ ని 2001లో స్థాపించిన దగ్గర నుంచి ప్రతీ ఎన్నికకూ అలాగే ఉప ఎన్నికకూ ఒక పవర్ ఫుల్ నినాదంతో వస్తారు. దానినే అస్త్రంగా మలుచుకుంటారు. ప్రజలకు ఆ విధంగా చేరువ అవుతారు. జనం నాడిని పట్టుకుంటూ ఇలా ఎన్నిక ఎన్నికకూ కొత్త అస్త్రాలతో ముందుకు రావడం కేసీఆర్ మార్క్ పాలిటిక్స్.
అయితే ఇపుడు చూస్తే కేసీఆర్ కి ఇంకా సరైన అస్త్రం దొరకడంలేదా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను విలన్లుగా చూపిస్తూ ఎన్నో ఎన్నికలలో రాజకీయ అస్త్రాలు కొత్తవిగా వాడుకుంటూ వచ్చారు. దాదాపుగా అన్నీ ఆయన సక్సెస్ అయ్యారు కూడా. అయితే ఇదంతా గతం అని అంటున్నారు. ఇపుడు ఆంధ్రా వాళ్ల మీద విమర్శలు చేసినా లేక వారిని నిందించినా ఓట్లు పడడంలేదు అని అంటున్నారు.
ఎందుకంటే తెలంగాణా పదేళ్ల క్రితం విడిపోయింది.కేసీఆర్ రెండు సార్లు సీఎం గా ఉన్నారు. దాంతో తెలంగాణా అభివృద్ధి అంతా కేసీఆర్ ఏమి చేశారు ఏమి చేయలేదు అన్న దాని మీదనే చర్చకు వస్తోంది. జనాలు కూడా అదే మాట్లాడుతున్నారు. ఆంధ్రా పాలన అని చెప్పినా జనాల మైండ్ కి అది ఎక్కడంలేదు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే గడచిన కొద్ది రోజులు గా బీఆర్ఎస్ లో పొలిటికల్ యాక్టివిటీ పెద్దగా కనిపించడంలేదు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరూ కూడా కవితకు బెయిల్ తీసుకుని వచ్చే పని మీద ఢిల్లీలో ఉంటున్నారు అని అంటున్నారు. కేసీఆర్ అయితే ఫాం హౌజ్ లోనే కూర్చున్నారు అని అంటున్నారు. ఆయన పార్టీ సీనియర్లతో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బీఆర్ఎస్ వర్తమాన దశ నుంచి ఎలా గట్టెక్కాలి అన్నది ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో సీరియస్ గానే భేటీలు జరుగుతున్నాయని అంటున్నారు.
సరే కేసీఅర్ పార్టీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నా మరో వైపు రోజుకొక నేత పార్టీ గడప దాటేస్తున్నారు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియడంలేదు అని అంటున్నారు. పార్టీలో మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నుంచి ఎంతమంది చివరికి ఉంటారు అన్నది కూడా లెక్క తెలియడం లేదు అని అంటున్నారు.
ఇక బీఆర్ఎస్ లో ఉన్న వ్యాపారస్థులు ఇతర రంగాలకు చెందిన వారు అంతా అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అన్నట్లుగా సర్దుకుంటున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మీద పోరాడాలన్నా లేక కేంద్రంలో ఉన్న బీజేపీ మీద గట్టి పోరు చేయాలన్నా కేసీఆర్ కి పదునైన అస్త్రం దొరకడంలేదు అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
శక్తివంతమైన అస్త్రం తోడుగా ఉంటేనే తప్ప కేసీఆర్ బయటకు రారు అని అంటున్నారు. ఆ అస్త్రం అండతోనే ఆయన జనం లోకి వస్తారు అని అంటున్నారు. కానీ రాజకీయాలు మారిపోయాయి. జనాలు తెలివి మీరిపోయారు. వారు టెంపరరీ ఎమోషన్స్ కి గతంలోలా అంత ఈజీగా కనెక్ట్ కావడంలేదు అని అంటున్నారు. లేని పోని ఆవేశాలు తెచ్చుకుని గతంలో గులాబీ పార్టీ వెంట నడచిన వారు ఇపుడు వాస్తవాల మీదనే ఆలోచిస్తున్నారు.
అన్నీ వారు విశ్లేషించుకుంటున్నారు. ప్రాంతీయ భేదాలు కానీ ఇతరత్రా సెంటిమెంట్లు కానీ వారు గతంలో మాదిరిగా పూర్తిగా పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దాంతో ఎమోషన్ నుంచి పుట్టి ఎమోషన్ తోనే ట్రావెల్ చేస్తూ వస్తున్న బీఆర్ఎస్ కి ఇది ఒక విధంగా గడ్డు కాలమే అని అంటున్నారు. దాంతో కేసీఆర్ కి ఏమి చేయాలో పాలుపోవడం లేదు అని అంటున్నారు. సో ముందు ముందు చూడాలి కేసేఅర్ కి ఎలాంటి అస్త్రం దొరుకుందో. ఏమి చేస్తారో.