మీడియా.. నోట్ దిస్ పాయింట్.. కేసీఆర్ ఎట్ 'మీడియా పాయింట్'

మంచి వక్త కావడంతో సభలు, సమావేశాలే కాక మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో కేసీఆర్ ప్రసంగం ప్రత్యర్థులనూ ఆకట్టుకుంటుంది

Update: 2024-07-27 10:17 GMT

తెలంగాణ ఉద్యమ సమయంలో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత.. బీఆర్ఎస్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు తెలుగు మీడియాతో అనేక విధాలుగా సంబంధం ఉంది. ఉమ్మడి ఏపీ ఉండగా.. కొన్ని గుల పత్రికలు, కొన్ని కుల పత్రికలు అని విమర్శించినా, ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదని నిందించినా.. తెలంగాణకు సీఎం అయ్యాక తమపై దుష్ప్రచారం చేసే మీడియాను పాతాళంలోకి తొక్కుతామని హెచ్చరించినా.. నచ్చని పత్రికలను, చానెళ్లను నిషేధించినా, సొంతంగా మీడియాను ఏర్పాటు చేసుకున్నా.. వెయ్యి నాగళ్లతో దున్నుతామన్న రామోజీ ఫిలిం సిటీకే సీఎం హోదాలో వెళ్లి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో సుదీర్ఘంగా భేటీ అయినా.. మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఓ సెక్షన్ మీడియా అంటూ విమర్శించినా.. ఇంకా ఎన్నో రకాలుగా కేసీఆర్ తెలుగు మీడియాతో పెనవేసుకున్నారు. అంతేకాదు.. కేసీఆర్ మీడియాతో మాట్లాడడం అంటే కొవిడ్ లాక్ డౌన్ సమయంలో టీఆర్పీలు పెంచే సాధనమయ్యేది. మంచి వక్త కావడంతో సభలు, సమావేశాలే కాక మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో కేసీఆర్ ప్రసంగం ప్రత్యర్థులనూ ఆకట్టుకుంటుంది.

సీఎం అయ్యాక సమావేశాలు తగ్గాయ్..

కేసీఆర్ తెలంగాణ సాధించి సీఎం అయ్యాక మీడియాను దూరం పెట్టారు. మరీ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన మీడియా ముందుకు రావడమే గగనమైంది. 2018 ముందస్తు ఎన్నికల్లో విజయం తర్వాత, కొవిడ్ సమయంలో తప్ప నేరుగా మీడియా సమావేశాలు నిర్వహించింది చాలా తక్కువ. మొత్తమ్మీద పదేళ్లలో సీఎం హోదాలో మీడియా ముందుకు వచ్చింది స్వల్పమేనని చెప్పాలి.

మీడియా పాయింట్ కొచ్చారోచ్..

తెలంగాణ ఏర్పడ్డాక సీఎంగా పదేళ్లు ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో మీడియా పాయింట్ కు రావాల్సిన అవసరం పడలేదు. ఏదైనా ఉంటే మంత్రులే చెప్పేసేవారు. అంతకుముందు ఎంపీగా ఉండడం 2004 నుంచి 2014 వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దకు రావాల్సిన అవసరం కలగలేదు. కాగా, గత ఏడాది ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలవడంతో కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యారు. డిసెంబరులో ప్రమాణ స్వీకారానికి కానీ.. ఆ తర్వాత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకు గానీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. అసలు ఆయన ఈ విడతలో అసెంబ్లీకి వస్తారా? అనే అనుమనాలూ కలిగాయి. వాటిని పటాపంచలు చేస్తూ గురువారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే హాజరయ్యారు. బడ్జెట్ రైతు వ్యతిరేకంగా ఉందని.. ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని ప్రకటించారు. అయితే, బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన ప్రదేశమే కీలకం. సమావేశాల మధ్యలోనే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ అక్కడి ‘మీడియా పాయింట్’ వద్ద ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. దీంతో ఇది ప్రత్యేక సన్నివేశంగా మిగిలింది.

Tags:    

Similar News