కేసీఆర్ కరెంట్ కోతపై కౌంటర్ మిస్ ఏంది రేవంత్?

అయితే.. తనకు ఎదురైన కోతల అనుభవాన్ని కేసీఆర్ ట్వీట్ రూపంలో పోస్టు చేస్తున్నట్లుగా చెబుతున్నా.. రికార్డుల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు.

Update: 2024-04-28 13:30 GMT

నిజం నలుగురి దగ్గరకు వెళ్లేసరికి.. అబద్ధం మాత్రం ఊరంతా వెళ్లి వస్తుంది. మంచి విషయాలు ఎన్నున్నా.. పక్కోడికి చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపం. అదే నెగిటివ్ అంశాలైతే.. పక్కనోడు పనిలో ఉన్నా డిస్ట్రబ్ చేసి మరీ.. మనం చెప్పాలనుకున్నది చెప్పేస్తాం. పాజిటివ్ అంశాలకు పరిమితులు ఎక్కువ. అదే.. నెగిటివ్ అంశాలకు విస్త్రతి ఎక్కువ. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ మిస్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఇంతవరకు అలవాటు లేని ట్వీట్లను శనివారం నుంచి షురూ చేశారు గులాబీ బాస్ కేసీఆర్. తన మొదటి ట్వీట్ తోనే బలమైన అస్త్రాన్ని.. అందరూ తన వైపు చూసేలా.. తాను చెప్పింది మాట్లాడుకునేలా చేశారు. పోరుబాట బస్సుయాత్రలో భాగంగా మహబూబన్ నగర్ లోని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంట్ పోయిందని పేర్కొన్నారు. తెలంగాణలో కరెంట్ పోవటం లేదని సీఎం.. డిప్యూటీ సీఎంలు ప్రతి రోజు ఉదరగొడుతున్నారని.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని.. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? అని ప్రశ్నించారు. మరి.. కేసీఆర్ మాటల్లోనిజమెంత? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసీఆర్ లాంటి పెద్ద మనిషి ఉత్తినే మాట అనరు కదా? ఎంతో కొంత నిజం లేకుండా ఆయన చేతి నుంచి ట్వీట్ పోస్టు కాదు కదా? అన్నది ప్రశ్న. అయితే.. వాస్తవాలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ట్వీట్ నేపథ్యంలో.. అక్కడి కరెంటు సరఫరాకు సంబంధించిన లాగ్ బుక్ లను యుద్ధ ప్రాతిపదికన చెక్ చేశారు.

అయితే.. కేసీఆర్ చెప్పినట్లుగా కరెంటు కోతలు అక్కడ ఏమీ లేవన్న విషయాన్ని ఝూఢీ చేసుకున్నారు అధికారులు. అదే సమాచారాన్ని సీఎంవోకు తెలియజేశారు. అయితే.. తనకు ఎదురైన కోతల అనుభవాన్ని కేసీఆర్ ట్వీట్ రూపంలో పోస్టు చేస్తున్నట్లుగా చెబుతున్నా.. రికార్డుల్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదంటున్నారు. అంతకు ముందు కూడా ఇదే తరహాలో కేటీఆర్ పోస్టు పెట్టటం.. దానికి విద్యుత్ అధికారులు రియాక్టు కావటం తెలిసిందే.

ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. కేసీఆర్ తన ట్వీట్ తో లక్షలాది మంది తన మాటను నమ్మేలా చేశారని చెప్పాలి. అదే సమయంలో.. కేసీఆర్ మాటల్లో నిజమెంత? అన్న అంశాన్ని అందరికి తెలియజేసేలా చేయటంలో రేవంత్ సర్కారు ఫెయిల్ అవు తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ పాలనలో లోపాల్ని ఎత్తి చూపితే.. అందులో నిజం ఉంటే దిద్దుకోవాల్సిందే. ఒకవేళ ఆ ఆరోపణల్లో నిజం లేకుంటే మాత్రం ఆ విషయాన్ని మరింత బలంగా కౌంటర్ రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. అబద్ధాలకు చెక్ చెప్పేందుకు చర్యల కత్తి తీసినా తప్పు లేదంటున్నారు. మరి.. రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News