ఎత్తుకు పైఎత్తు.. కేసీఆర్ వర్సెస్ మైనంపల్లి
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమయంలో మైనంపల్లి తిరుపతిలో ఉన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురించి సరిగా తెలీని వారు చాలా మాటలే అనుకోవచ్చు. కానీ.. ఆయన బలం.. బలగం.. మైండ్ సెట్ గురించి తెలిసిన వారు మాత్రం ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలకు పెద్దగా ఆశ్చర్యపోయింది లేదు. సంచలన వ్యాఖ్యలు చేసేందుకు ఏ మాత్రం తగ్గని ఆయనకు భోళాతనం.. సాయం కోసం వచ్చిన వారు ఎవరైనా సరే.. వెనకాముందు చూసుకోకుండా సాయం చేసి పంపే తీరు ఆయనకో పెద్ద ప్లస్ పాయింట్ గా చెబుతారు. ఎవరికేం జరిగినా పెద్దగా పట్టించుకోని ఆయన.. తాను ఒకసారి ఫిక్సు అయ్యాక.. తాను అనుకున్నది జరగకుంటే మాత్రం అస్సలు తగ్గరు. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా తెగిస్తారు.
కొన్నేళ్ల క్రితం తన కొడుక్కి బీఆర్ఎస్ అధినాయకత్వానికి సంబంధించిన కీలక నేత ఇచ్చిన హామీతో మెదక్ సీటు మీద ఫోకస్ చేశారు మైనంపల్లి కుమారుడు. తాజాగా విడుదల చేసిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మైనంపల్లికి సీటు కన్ఫర్మ్ చేసిన కేసీఆర్.. మెదక్ సీటుకు మాత్రం మైనంపల్లి కుమారుడికి మొండి చెయి చూపించి.. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ కు సీటు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మైనంపల్లి సీరియస్ కావటమే కాదు.. ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావుపై నిప్పులు చెరిగారు.
గడిచిన పదేళ్లలో ముఖ్యమంత్రి మీద కానీ ఆయన కుటుంబ సభ్యుల మీదా బోలెడన్ని ఆరోపణలు వచ్చాయి. ఇవి ఫ్రూవ్ అయ్యాయా? లేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. కేసీఆర్ ఫ్యామిలీ మీద ఇట్టే వేలెత్తి చూపించే వారు సైతం.. మంత్రి హరీశ్ రావును ఒక మాట అనటానికి ఇష్టపడరు. అందుకు భిన్నంగా మైనంపల్లి మాత్రం మంత్రి హరీశ్ మీద సంచలన వ్యాఖ్యలు చేయటంతో పాటు.. రూ.లక్ష కోట్లు అవినీతికి పాల్పడినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసి.. అందరూ ఉలిక్కి పడేలా చేశారు.
ఇటీవలకాలంలో కేసీఆర్ కోటలోనూ హరీశ్ రావు పరపతి పెరిగినట్లుగా చెబుతున్నారు. కీలక ఎన్నికల్లో టాస్క్ మాస్టర్ గా పని చేసే హరీశ్ కు ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వటం తప్పు లేదంటున్నారు. మరి.. అలాంటి కీ రోల్ ప్లే చేస్తున్న హరీశ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన మైనంపల్లిపై ఇప్పటివరకు చర్యల కత్తి దూయలేదంటున్నారు. తాను కోరుకున్నట్లుగా తన కుమారుడికి మెదక్ సీటు కేటాయించకపోవటంపై కినుకు వహించిన ఆయన.. సంచలన కామెంట్లు చేశారు.
నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సమయంలో మైనంపల్లి తిరుపతిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జాబితాను ప్రకటించినంతనే.. ఆవేశానికి గురైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధినాయకత్వం సీరియస్ అయినప్పటికీ.. వెంటనే తిరుపతి నుంచి రాకుండా.. దాదాపు వారంపాటు అవుటాఫ్ స్టేషన్ లో ఉన్నారు. రెండో రోజు మాట్లాడిన మైనంపల్లి.. తాను పార్టీని.. అధినేతను ఏమీ అనలేదన్న క్లారిటీ ఇవ్వటంతో పాటు.. మెదక్ టికెట్ విషయంలో తగ్గేదెలే అన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
మైనంపల్లి ఎపిసోడ్ చూసిన వారంతా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనపై వేటు వేస్తారని.. ఉపేక్షించరని అనుకున్నారు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొని ఉండటం ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అటు కేసీఆర్.. ఇటు మైనంపల్లి దాగుడుమూతలు ఆడుతున్నట్లుగా చెబుతున్నారు. గీత దాటిన మైనంపల్లిపై వెంటనే వేటు వేస్తే.. తదనంతర పరిణామాలు ఉంటాయన్న దానిపై గులాబీ బాస్ లెక్కలు వేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అదే సమయంలో.. అధినేత నోటి నుంచి వేటు మాట బయటకు వచ్చిన తర్వాతే.. తన నిర్ణయాన్ని ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. అటు కేసీఆర్.. ఇటు మైనంపల్లి ఎవరికి వారు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు చెబుతున్నారు. మైనంపల్లికి ఉన్న బలం నేపథ్యంలో ఆయనపై వేటు వేయలేదంటున్నారు. దీనిపై హరీశ్ ను అభిమానించే వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితే కేటీఆర్ కు ఎదురైతే.. వేటు పడుతుంది కదా? అలాంటప్పుడు.. హరీశ్ ను అంటే మాత్రం వేటు వేయరా? చర్యల కత్తి బయటకు తీయరా? అన్న ప్రశ్నలు పలువురు నోట వినిపిస్తుండటం గమనార్హం.