కేదార్ ఇంట్లో మరో మాజీ ఎమ్మెల్యే.. ఎంతమంది ఉన్నారు బాసూ?
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేదార్ సదరు ఇంటిని లీజ్ కు తీసుకున్నట్లు చెబుతున్నారు.
టాలీవుడ్ నిర్మాత.. గతంలో డ్రగ్స్ కేసులో నిందితుడు.. కొకైన్ వాడినట్లుగా పరీక్షల్లో తేలిన కేదార్.. దుబాయ్ లోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. నిద్రలోనే మరణించిన నేపథ్యంలో అనుమానాస్పద రీతిలో మరణించినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో కేదార్ నివాసం ఉన్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేదార్ సదరు ఇంటిని లీజ్ కు తీసుకున్నట్లు చెబుతున్నారు.
కేదార్ మరణించిన వేళలో తెలంగాణకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయటంతో పాటు.. వారందరికి తాను అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. అదే సమయంలో.. తాను దుబాయ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుందని.. అందులో వాస్తవం లేదని పేర్కొన్నారు.
తాను మణికొండలోని తన ఇంట్లో ఉన్నట్లుగా పేర్కొంటూ ఒక సెల్ఫీ వీడియో పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పైలెట్ రోహిత్ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున మీడియా ప్రతినిదులు వెళ్లారు. అయితే.. వారిని ఆయన కలవలేదు. ఆ ఇంట్లో పని చేసే సిబ్బంది మాత్రం.. రోహిత్ రెడ్డి ఇంట్లో ఉన్నారని కాసేపు.. లేదు పండుగ కదా.. సారు బయటకు వెళ్లారు అని కాసేపు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మరో సంచలన అంశం తెర మీదకు వచ్చింది. దుబాయ్ లో మరణించిన కేదార్ నివాసంలోనే మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక ప్రముఖ దినపత్రికలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా కేదార్ నివాసంలోనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆయన మరణానికి ముందు మూడు రోజులు సదరు మాజీ ఎమ్మెల్యే అక్కడే బస చేసినట్లుగా సమాచారం. దీంతో.. అసలు ఎంతమంది ప్రముఖులు కేదార్ ఇంట్లో ఉన్నారు? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు రెండు డజన్లకు పైనే కేదార్ ఇంట్లో బ్యాక్ టు బ్యాక్ పార్టీలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది. అదే సమయంలో కేదార్ మరణంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.