బీజేపీ తరఫున ప్రచారం చేస్తా: మోడీకి కేజ్రీవాల్ బిగ్ ఆఫర్
కొన్నాళ్ల కిందట జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ తన స్థానంలో మంత్రి అతిషీకి పగ్గాలు అప్పగించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే ఉప్పు నిప్పులా చిందులు తొక్కే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ గురించి అందరికీ తెలిసిందే. లిక్కర్ కుంభకోణంలో తనను అన్యాయంగా ఇరికించి.. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా.. తన సర్కారును కూలగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపణలు గుప్పించిన విషయం కూడా తెలిసిందే. కొన్నాళ్ల కిందట జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ తన స్థానంలో మంత్రి అతిషీకి పగ్గాలు అప్పగించారు.
ప్రస్తుతం ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఢిల్లీలో వరుసగా మూడో సారి కూడా అధికా రం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్ మోడీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పాలిస్తున్న 22 రాష్ట్రాల్లో ప్రజలకు ఉచితంగా విద్యుత్ అందించాలని ఆయన సవాల్ చేశారు. అలా చేస్తే.. తాను వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పారు.
అంతేకాదు.. స్వయంగా తానే రంగంలోకి దిగి బీజేపీని గెలిపించేలా ప్రజలకు విజ్ఞప్తి కూడా చేస్తానన్నారు. ఈ సవాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఢిల్లీలో తాము మరోసారి(వరుసగా మూడోసారి ) అధికారంలోకి వస్తే.. ప్రజలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని ఆయన భారీ ప్రకటన జారీ చేశారు.
ఇక, దేశరాజధాని ఢిల్లీలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉందని.. అయినా.. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఈ రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యమే నడుస్తోందన్నారు. ఆయనను కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆడిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనికి ప్రజలు చెక్ పెట్టాలని కేజ్రీవాల్ విన్నవించారు. మరోసారి ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.