కేరళలో సిత్రమైన సీన్.. సీఎస్ భర్త రిటైర్మెంట్.. భార్యకు కీలక పోస్టు!

ఇదిలా ఉంటే.. కేరళలో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ వేణు ఈ నెల 31న రిటైర్ అవుతున్నారు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది.

Update: 2024-08-23 08:30 GMT

భార్యభర్తలైన ఐఏఎస్ అధికార జంటలు బోలెడన్ని ఉంటాయి. కానీ.. ఇప్పటివరకు ఎప్పుడూ లేని ఒక సిత్రమైన సీన్ ఒకటి కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. విన్నంతనే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతం చూసినప్పుడు సదరు ఐఏఎస్ కఫుల్ ను ఇస్పెషల్ గా చెప్పక తప్పదు. ఒక రాష్ట్రానికి అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పేరుకు రాష్ట్రానికి నాయకుడు ముఖ్యమంత్రే అయినప్పటికీ.. సదరు ప్రభుత్వాన్ని నడిపించే చీఫ్ కెప్టెన్ మాత్రం సీఎస్ గా చెప్పక తప్పదు.

ఇదిలా ఉంటే.. కేరళలో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ వేణు ఈ నెల 31న రిటైర్ అవుతున్నారు. అయితే.. ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఆయన సతీమణి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారిణే. ఆమె పేరు శారదా మురళీధరన్. భర్త రిటైర్ అయిన తర్వాత రోజే.. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలా కీలకమైన పదవిని భర్త తర్వాత భార్య చేపట్టటం బహుశా చరిత్రలో ఇదే తొలిసారిగా భావిస్తున్నారు.

ఈ ఇద్దరూ 1990 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులే. పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలులో దిట్టగా వీరికి మంచి పేరుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థంగా అమలు చేశారన్న పేరు ఆమె సొంతం.

2013లో కేంద్రంలో డిప్యూటేషన్ లో ఉన్నప్పుడు పంచాయితీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీగా.. నేషనల్ రూల్ లైవ్లీహుడ్ మిషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఆమె వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె స్థానిక స్వపరిపాలన శాఖ అదనపు చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. భర్త రిటైర్ అయిన తర్వాతి రోజునే.. భర్త పోస్టులోకి రానున్న భార్య ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదో రేర్ మూమెంట్ గా పలువురు అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News