ఆయనంతే.. అందు'కేకే'.. ఎవరికీ అర్థం కాని తిర'కేసే'..

కానీ, ఆ పార్టీ ఓడగానే దానికి రాజీనామా చేసి గెలిచిన పార్టీలో చేరారు.

Update: 2024-08-28 17:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అత్యంత సీనియర్ నాయకుడు ఎవరంటే.. అందరూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేరు చెబుతారేమో? కానీ.. అత్యంత సీనియర్ ఆయన కాదు అనే సంగతి చాలామందికి తెలియదు. అయితే, అత్యంత సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన చేసే వ్యాఖ్యలు, తీసుకునే నిర్ణయాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉమ్మడి ఏపీలోనే అతిపెద్ద పార్టీకి అందులోనూ అధికారంలో ఉన్న సమయంలో అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. రాజ్య సభ సభ్యత్వమూ పొందిన ఆయన.. ఆ తర్వాత అనూహ్యంగా రాజీనామా చేశారు. వేరొక పార్టీలో చేరి అందులో కీలక పదవులు అనుభవించారు. ఆపై ఆయన కుమార్తెకు రెండుసార్లు చాలా కీలక పదవి దక్కింది. కానీ, ఆ పార్టీ ఓడగానే దానికి రాజీనామా చేసి గెలిచిన పార్టీలో చేరారు. ఇప్పుడు మొన్నటివరకు ఉన్న పార్టీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.

ఆయనంతే..

కంచర్ల కేశరరావు (కేకే).. పరిచయం అక్కర్లేని తెలుగు నాయకుడు. సాధారణ నేపథ్యం నుంచి మొదలై కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు అనుభవించే స్థాయికి ఎదిగారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉండగా.. కేకే పీసీసీ అధ్యక్షుడు కావడం గమనార్హం. ఆ తర్వాత కేకేకు రాజ్య సభ సభ్యత్వం కూడా ఇచ్చింది కాంగ్రెస్. ఆ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన వర్కంగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోనూ చోటు కల్పించింది. తెలంగాణవాదాన్ని బలంగానూ వినిపించారు. కానీ, 2013లో తెలంగాణ ఏర్పాటులో ఆలస్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) లో చేరారు. బీఆర్ఎస్ తెలంగాణ అధికారంలో ఉండగా కేకేను రాజ్యసభ సభ్యత్వంతో గౌరవించింది. కుమార్తె గద్వాల్ విజయ లక్ష్మిని జీహెచ్ఎంసీకి రెండుసార్లు మేయర్ ను చేసింది. బీఆర్ఎస్ లో అన్ని ప్రయోజనాలు పొందిన కేకే ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. 85 ళ్ల వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరడం గమనార్హం. కాగా, 2005లో ఏపీసీసీ అధ్యక్షుడు అయిన కేకే తనదైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. మేధావి అయినప్పటికీ.. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయేది. 2007లో కేకే కుమారుడు ఇంట్లో కాల్పులు పెద్ద సంచలనం. ఓ దశలో తాను ‘కేశవరెడ్డి’ కానందునే ముఖ్యమంత్రి కాలేకపోయానని వ్యాఖ్యానించారు. కాగా, బీఆర్ఎస్ లో ఉండగానూ కేకే కుటుంబం భూముల విషయం వివాదాస్పదమైంది.

కవిత విడుదలపై హర్షం ఎందుకు?

2013 నుంచి బీఆర్ఎస్ లో కొనసాగిన కేశవరావు.. ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ లో చేరారు. అయితే, ఆయన తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలపై స్పందించారు. ఆమె విడుదలకు అర్హురాలు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అయిన కవిత.. తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అధినేత కూతురుపై సానుకూలంగా స్పందించడం ఏమిటో? అర్థం కాని పరిస్థితి. కవిత జైలు నుంచి విడుదలవడాన్ని కేకే స్వాగతిస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఓవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ సమష్టి విజయమే కవితకు బెయిల్ అని బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటుండగా.. బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే కవితకు బెయిల్ దొరికిందని కాంగ్రెస్ అంటోంది. ఈ సమయంలో కేకే.. కవితకు బెయిల్ దక్కడాన్ని సమర్థించడం కాంగ్రెస్ పార్టీ వారిని తలలు పట్టుకునేలా చేసింది.

Tags:    

Similar News