కేశినేనికి వైసీపీ రాయబారం.. ఏం జరిగింది..!
కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ యువ నేత ద్వారా ఈ రాయబార రాజకీయాలకు తెరదీసిందని వైసీపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది.;

వైసీపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఒక్కసారి పార్టీ నుంచి వెళ్లిపోతామని చెప్పిన నాయకు లకు కానీ.. వెళ్లిపోయిన వారికి కానీ.. ఆ పార్టీ మొహం చూపించదన్న విషయం తెలిసిందే. ఎవరితోనూ పార్టీ అధినేత జగన్ బుజ్జగింపు రాజకీయాలు కూడా చేయరన్న విషయం అందరికీ తెలిసిందే. వెళ్లిపోతామన్న వారిని వెళ్లిపోమనే చెబుతారు. ఉంటామన్నవారితోనే పనిచేయించుకుంటామని.. పార్టీని నడిపించుకుం టామని కూడా చెబుతుంటారు.
ఈ క్రమంలో గత ఏడాది కాలంలో అనేక మంది నాయకులు వెళ్లిపోయినా.. ఒక్కరిద్దరు నాయకులతో తప్ప .. జగన్ సంప్రదించింది లేదు. వారిని ఉండమని కోరింది కూడా లేదు. పెద్ద పెద్ద నేతల నుంచి చోటా నాయకుల వరకు పదుల సంఖ్యలో జంప్ చేశారు. అయినా.. జగన్ వగచింది కూడా లేదు. కానీ.. తొలిసారి ఓ సంచలన ఘట్టం చోటు చేసుకుంది. విజయవాడ మాజీ ఎంపీ.. కేశినేని శ్రీనివాస్.. ఉరఫ్ నానికి తాజాగా ఆదివారం.. వైసీపీ రాయబారం పంపినట్టు తెలిసింది.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓ యువ నేత ద్వారా ఈ రాయబార రాజకీయాలకు తెరదీసిందని వైసీపీ వర్గాల మధ్య చర్చ నడుస్తోంది. నాని విషయానికి వస్తే.. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. తర్వాత.. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీని వీడి వైసీపీ బాట పట్టారు. ఎక్కువ కాలం వైసీపీలో ఉండలేదు. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసిన ఆయన సొంత సోదరుడి చేతిలోనే పరాజయం పాలయ్యారు.
దీంతో వైసీపీకి, రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పారు. కొన్నాళ్లు మౌనంగానే ఉన్న కేశినేని.. ఇటీవల పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశంపై తన సోషల్ మీడియాలో జోరుగా స్పందించారు. దీంతో ఆయన రాజకీయాలకు దూరం కాలేదన్న చర్చ తెరమీదికి వచ్చింది. మరోవైపు.. వైసీపీలోనూ కీలక నాయకులు పార్టీకి దూరం కావడం.. ఉన్నవారిలో ఆర్థికంగా, సామాజికంగా కూడా.. బలంగా ఉన్న నాని అయితే.. బెటర్ అని భావించడంతో తిరిగి రావాలంటూ.. ఆయనకు రాయబారం పంపినట్టు తెలుస్తోంది. మరి నాని ఏం చేస్తారో చూడాలి.