ఆయన అనుమతితోనే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశాం.. ఈడీ విచారణలో కీలక వివరాల వెల్లడి
ఈ కేసులో ఇప్పటికే ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చగా.. రోజురోజుకూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ, ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిలను చేర్చగా.. రోజురోజుకూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నాయి. తాజాగా.. ఈడీ ఎదుట బీఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు.
మాజీమంత్రి కేటీఆర్‌ను విచారించే ముందే వీరిని విచారించడం వల్ల వివరాలు బయటపడుతాయనే ఉద్దేశంతో ముందుగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ ఎంక్వయిరీకి పిలిచింది. వీరి విచారణ ద్వారా కీలక అంశాలను బయటకు తీయొచ్చని అధికారులు భావించారు. దాంతో విచారణకు హాజరైన బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది.
అనుమతులు లేకుండా రూ.55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి ఎలా బదిలీ చేశారని ఈడీ బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించింది. దీనికి ఆయన బదులిస్తూ.. అరవింద్ కుమార్ ఆదేశాలతో ఎఫ్ఈఓకి డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. తమకున్న పరిధిలోని డబ్బులు బదిలీ చేశామని వెల్లడించారు. తమ పైస్థాయి అధికారి పర్మిషన్ తీసుకొని డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చెప్పారు. రూ.46 కోట్లను విదేశీ మారక ద్రవ్య రూపంలో చెల్లించినట్లు ఒప్పుకున్నారు.
అలాగే.. రెండో దశ రేసింగుకు ఆటంకం లేకుండా ఉండేందుకే ఇలా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని బీఎల్ఎన్ రెడ్డి తెలిపారు. రెండో దఫాకు అడ్వాన్స్ పేమెంట్ చెల్లించకపోతే రద్దయ్యే అవకాశం ఉందని, రేసింగ్ సక్రమంగా నిర్వహించేందుకే అదే ఉద్దేశంతో డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. ఏఎస్ నెక్ట్స్ మొదటి దఫా రేసింగ్ నిర్వహించిందని, ఆ తరువాత భాగస్వామ్యం నుంచి తప్పుకుందన్నారు. కంపెనీ తప్పుకోవడంతో హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించిందని తెలిపారు.
మరోవైపు.. ఈడీ, ఏసీబీ విచారణలు కొనసాగుతుండగా బీఆర్ఎస్ కేడర్‌లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు మరోసారి కేటీఆర్‌కు ఈడీ, ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈసారి ఆయన తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో తమ నాయకుడు అరెస్టు తప్పదా అన్న ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అంతా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు.